మధ్యాహ్నం.. అధ్వానం
⇒ మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం
⇒ మెత్తని అన్నం.. నీళ్లచారే దిక్కు
⇒ ఇంటి నుంచి తెచ్చుకుని తింటున్న విద్యార్థులు
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం పథకం అధ్వానంగా మారుతోంది. ఉడికీఉడకని మెత్తటి అన్నం.. నీళ్లచారుతో విద్యార్థులు కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది.
వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు ఒక గుడ్డు ఇవ్వడానికే పరిమితమవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలోని చాలా ఏజెన్సీలు మెనూ పాటించడం లేదు. నీళ్లచారు, మెత్తటి అన్నంతో సరిపెడుతున్నారు. దీంతో సగం మంది విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు. మరికొంత మంది నాణ్యతలేని భోజనం చేస్తూ అవస్థలు పడుతున్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలలో ఉపాధ్యాయులు పట్టించుకోక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 1172 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 954 ఉండగా, 44,064 మంది విద్యార్థులు చదువుతున్నారు. 112 ప్రాథమికోన్నత పాఠశాలుండగా ఇందులో 18,073 మంది, 106 ఉన్నత పాఠశాలల్లో 10,304 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 72,441 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.4.13 పైసలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.6.18పైసల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. అలాగే ఒక్కో విద్యార్థికి వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలి. ఒక్కో గుడ్డుకు రూ.4 చొప్పున నిధులు విడుదల చేస్తోంది.
నాణ్యతలేని భోజనమే దిక్కు..
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయిస్తోంది. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ప్రతీరోజు విద్యార్థులకు అన్నం, సాంబార్, పప్పు వండిపెట్టాలి. కానీ చాలా ఏజెన్సీలు కక్కుర్తితో నీళ్లచారు వడ్డిస్తున్నారు. వారంలో మూడుసార్లు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ చాలా పాఠశాలల్లో ఇది అమలు కావడం లేదు. వారంలో ఒకరోజు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. కొన్నిచోట్ల కోడిగుడ్లకు బదులు అరటిపండ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సన్నరకం బియ్యం అయినప్పటికీ అన్నం మెత్తగా కావడంతో సగం మంది విద్యార్థులు తినలేకపోతున్నారు. ఇంటినుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకుని పాఠశాలల్లో భోజనం చేస్తున్నారు. కొంతమంది ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కుమ్మక్కై భోజనం చేయని విద్యార్థుల డబ్బులు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
లోపించిన పర్యవేక్షణ..
ఏజెన్సీల నిర్లక్ష్యం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిం ది. విద్యార్థులకు మెరుగైన ఆహారం అందడం లేదు. ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మండ ల విద్యాధికారులు కనీసం పాఠశాలలను నెలకోసారి తనిఖీ చేయాలి. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. చాలామంది ఎంఈవోలు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. వీరితో పాటు ఉప విద్యాధికారులు తనిఖీ చేయాల్సి ఉండగా, వారు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
వారం భోజనం
సోమవారం ఉడికించిన కోడిగుడ్లు, అన్నం, సాంబార్
మంగళవారం కూరగాయలతో భోజనం
బుధవారం అన్నం, పప్పు, కూరగాయలతో భోజనం, ఉడికించిన కోడిగుడ్లు
గురువారం సాంబార్ పప్పు భోజనం
శుక్రవారం కూరగాయలతో భోజనం, ఉడికించిన కోడిగుడ్లు
శనివారం పప్పు, ఆకుకూరలతో భోజనం
పకడ్బందీగా అమలు చేస్తాం
మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. మెనూ ప్రకారం పాఠశాలల్లో భోజనం పెట్టాలి. వారానికి మూడు ఉడికించిన కోడిగుడ్లు విద్యార్థులకు ఇవ్వాలి. ప్రధానోపాధ్యాయులు ప్రతీరోజు మధ్యాç ßæ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. కుకింగ్ కాస్ట్ కూడా పెరిగింది. నిర్వాహకులు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించా లి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.
– కె.లింగయ్య, డీఈవో, ఆదిలాబాద్
గర్భిణులకు రక్త పరీక్షలు తప్పనిసరి
ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్): గర్భిణులు రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంత్‌రావు అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులోభాగంగా బుధవారం మండల కేంద్రంలోని సబ్సెంటర్లో ఆయన గర్భిణులకు చేస్తున్న రక్త పరీక్షలు, బీపీ పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 39 సబ్‌సెంటర్ల పరధిలోని గర్భిణులకు కూడా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆయన వెంట ఏఎంవో వెంకటేశ్వర్లు తదితరులున్నారు.