కుప్పకూలనున్న మినీ ప్యాంగ్యాంగ్
ప్యాంగ్ యాంగ్: ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరానికి నకలుగా 500 ఎకరాల్లో కోట్లాది డాలర్లను వెచ్చించి నిర్మించిన మినీ ప్యాంగ్యాంగ్ మోడల్ విలేజ్‌ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేయాల్సిందిగా దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ మినీ మోడల్ విలేజ్‌ని చూస్తే తనకు దేశ ద్రోహం కేసు కింద ఉరి శిక్షకు గురైన తన అంకుల్ జాంగ్ సంగ్ థేక్ గుర్తొస్తాడని, అందుకనే ఈ మోడల్ గ్రామాన్ని నామరూపాలు లేకుండా సర్వనాశనం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి.
దేశ రాజధాని ప్యాంగ్ యాంగ్ నగరాన్ని పోలిన నమూనా విలేజ్‌ను మినీయేచర్లతో నిర్మించాలన్నది కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ ఆలోచన. ఆయన మానస పుత్రికైన ఈ మోడల్ విలేజ్ ను కిమ్ జాంగ్ ఉన్ అంకుల్ జాంగ్ సంగ్ పర్యవేక్షణలో 2012లో పూర్తి చేశారు. దేశ ద్రోహం నేరం కింద జాంగ్ సంగ్‌ను 2013, డిసెంబర్ నెలలో ఉరి తీశారు. ఆయన కుక్కకన్నా అధ్వాన్నమని, ద్వేషించాల్సిన మానవ మలినం అని ఆయన్ని కిమ్ జాంగ్ ఉన్ ఈసడించేవారు.
అలాంటి వ్యక్తి పర్యవేక్షణలో పూర్తయిన ఈ మోడల్ విలేజ్ ఆయన్ని ఏ మాత్రం గుర్తుకు తీసుకురాకూడదనే ఉద్దేశంతోనే నిర్మూలనకు ఉన్ ఆదేశించారన్నది దక్షిణ కొరియా మీడియా కథనం. మినీ విలేజ్‌కి పర్యాటకుల ఆదరణ కూడా పెద్దగా లేదని, వారిని ఆకర్షించేందుకు వీలుగా దాన్ని పునరుద్ధరించడం కోసమే తాత్కాలికంగా మోడల్ విలేజ్‌ని మూసేశారని స్థానిక ట్రావెల్ ఏజెన్సీలు తెలియజేస్తున్నాయి.