‘ఉపాధి' పెరిగేనా ?
సాక్షి, చిత్తూరు: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో 7 మండలాలకు మాత్రమే పరిమితం చేయబోతున్నారన్న అపోహలకు తెరపడింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన 2015-16 బడ్జెట్లో ఈ పథకానికి రూ.34,699 కోట్లు కేటాయించారు. 2014-15లో రూ.31 వేల కోట్లు కేటాయించగా దాన్ని 12 శాతం పెంచి ఈసారి కేటాయింపులు చేశారు. ఈ నేపథ్యంలో పనులు మరింతగా పెరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సంవత్సరంలో వంద రోజులకు తగ్గకుండా ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఉపాధి హామీ పథకాన్ని నిలిపేస్తున్నట్లు ప్రచారం సాగింది.
అటు తర్వాత దీన్ని మరింత కుదించి దేశవ్యాప్తంగా కరువు తీవ్రంగా ఉన్న మండలాలలకే పరిమితం చేయబోతున్నారన్న వార్తలూ వచ్చాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏడు మండలాలకే పరిమితం చేయబోతున్నారన్న ప్రచారం కూలీలను ఆందోళనలో పడేసింది. ఈ క్రమంలో ఈ పథకానికి బడ్జెట్ పెంచడమేగాక గ్రామీణ మౌలిక వసతుల పెంపు, క్రీడా ప్రాంగణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివి కూడా దీనికి కిందకు తీసుకొచ్చింది. బిల్లుల చెల్లింపును ఆధార్ కార్డుకు లింకు చేయనున్నా రు. జిల్లాలో 5.94 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరందరికీ ఉపాధి పనులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
జిల్లాలో ఇప్పటివరకూ పరిస్థితి భిన్నంగా ఉంది. జాబ్‌కార్డుల్లో ఐదు శాతం మందికి కూడా పనులు కల్పించడం లేదు. జిల్లావ్యాప్తంగా 12 క్లస్టర్లు ఉండగా చిత్తూరు క్లస్టర్లో 3,478 మందికి, పుత్తూరు 1,248, నగరి 1,858, శ్రీకాళహస్తి 1,931, తిరుపతి 2,394, చంద్రగిరి 4,001, సదుం 2,551, పీలేరు 4,119, తంబళ్లపల్లె 2,820, మదనపల్లె 1,783, పలమనేరు 4,228, కుప్పం 3,825 మందికి పనులు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ గ ణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన మొత్తం రోజుకు 34,796 మంది కి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. మిగిలిన 5.60 లక్షల మందికి పనుల్లేవు. రోజూ లక్ష మందికి పనులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నాదరిదాపులకు కూడా చేరని పరిస్థితి.
ఒక వైపు వర్షాభావం, మరో వైపు కరువు నేపథ్యంలో అందరికీ పనులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. వాస్తవంగా 5.94 లక్షల మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు రూ.169 చొప్పున రోజూ రూ.10,03, 86,000 నిధులు వెచ్చించాల్సి ఉంది. పనులు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు వలసబాట పట్టారు. ముఖ్యంగా తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, కుప్పం, పూతలపట్టు తదితర ప్రాంతాల నుంచి ప్రజలు బెంగళూరు, చెన్నైకు వలస వెళ్తున్నారు. రాబోయే కాలంలోనైనా అందరికీ పనులు కల్పిస్తారని ఆశిస్తున్నారు.