ఏదో ఒకటి చేసి నమ్మించండి
⇒ ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసిపోతోంది..
⇒ ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాం
⇒ అధికారులకు మంత్రి గంటా ఆదేశం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ‘పీసీపీఐఆర్ వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసేట్టుగా ఉంది. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకు ఇప్పటికే మనపై నమ్మకం పోతోంది. ఏదో ఒకటి చేయండి. ప్రజల ఆగ్రహం చల్లారేలా కనికట్టు చేయండి’ అధికారులకు మంత్రి, ఎమ్మెల్యేల ఆదేశం ఇదీ. పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(పీసీపీఐఆర్) వ్యవహారం జిల్లా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. వేలాదిమందిని నిరాశ్రయులను చేయనున్న ఈ ప్రతిపాదనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 18న నక్కపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం అంటేనే జిల్లా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు. దాంతో మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పంచకర్ల రమేష్ బాబు రంగంలోకి దిగారు.
కలెక్టర్ యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, ఎస్పీ కోయ ప్రవీణ్‌లతోపాటు రెవెన్యూ, వుడా అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అనిత, రమేష్‌బాబు జిల్లా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీపీఐఆర్ అంటేనే ప్రజలు కొట్టేట్లుగా ఉన్నారని మంత్రి గంటా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పీసీపీఐఆర్ పేరుతో ఊళ్లు ఖాళీ చేయమంటే ప్రజలు తిరగబడటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. తమను కనీసం సంప్రదించకుండా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఎందుకు నిర్ణయించారని మంత్రి కలెక్టర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఇది ప్రభుత్వం హైదరాబాద్‌స్థాయిలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. దాంతో మంత్రి ఎలా స్పందించాలో తెలియక మంత్రి ఇబ్బందిపడ్డారు. పీసీపీఐఆర్ అంటే తమకే అవగాహన లేకుంటే ప్రజలకు ఏం సర్దిచెప్పగలమని ఆయన ప్రశ్నించారు. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రజాభిప్రాయ సేకరణ వద్దన్నారు. పీసీపీఐఆర్ అని ప్రజల్ని ఇబ్బంది పెడితే తిరగబడతారని వ్యాఖ్యానించడం గమనార్హం. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ ఏ ప్యాకేజీ ఇస్తామో ప్రజాభిప్రాయ సేకరణకు ముందే చెబితే ఆగ్రహం కొంతవరకు తగ్గించొచ్చన్నారు.
కనికట్టు చేయండి : సమావేశంలో చివరగా మంత్రి గంటా మాట్లాడుతూ పీసీపీఐఆర్ నిరాశ్రయులకు మంచి ప్యాకేజీ ఇస్తామని ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదో ఒకటి చేసేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించాలని స్పష్టంగా చెప్పారు. సోమవారం నుంచి గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎమ్పీటీసీలకు పీసీపీఐఆర్‌పై మొదట అవగాహన కల్పించాలని చెప్పారు. దీంతో డిసెంబర్ 2న జిల్లామంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీలతో వుడా కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో డీఆర్వో నాగేశ్వర్రావు, అనకాపల్లి, విశాఖపట్నం, నర్సీపట్నం ఆర్డీవోలు, వుడా, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.