మంత్రి కుమారునిపై ఫిర్యాదు
నగర్: కాంట్రాక్టుతో నాసిరకం రోడ్డు నిర్మాణం జరుపుతున్నట్లు మంత్రి పూనాట్చి కుమారునిపై ఫిర్యాదు అందింది. తిరుచ్చి జిల్లా, మన్నచనల్లూరు సమీపంలోగల తిరుప్పజీలి వనత్తాయి అమ్మన్ ఆలయ ప్రాంతం నుంచి మూవాయిరంపాళయం వెళ్లే 2.4 కిలోమీటర్ల మట్టి రోడ్డును తారురోడ్డుగా మార్చేందుకు పనులు రూ.53 లక్షల ఖర్చుతో జరుగుతున్నాయి. ఈ పనులను కలెక్టర్ పళనిసామి, ఇతర అధికారులు తనిఖీలు చేశారు.
ఆ సమయంలో రోడ్డు పనులకు నాణ్యత లేని కంకర ఉపయోగించినట్లు, అదికూడా రెండు పొరలకు బదులుగా ఒకే పొరవేయడాన్ని గమనించిన అధికారులు దిగ్భ్రాంతి చెందారు. దీంతో ఆ పనులు జరిపే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఆ సమయంలో మంత్రి పూనాట్చి కుమారుడు అరుణ్ కాంట్రాక్టు పనులు జరుపుతున్నట్లు తెలిసింది. దీంతో అతనిపై చర్యలు ఎలా తీసుకోవాలో తెలియకుండా అధికారులు తికమకపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి కుమారుడు కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు, అతన్ని కలిసేందుకు కలెక్టర్ అనుమతి ఇవ్వనట్లు సమాచారం.