ప్రపంచ పెద్దావిడ కన్నుమూశారు
టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన కురువృద్ధురాలు మిసావో ఒకావా కన్నుమూశారు. గత నెలలోనే 117వ జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆమె గుండె పనిచేయడం ఆగిపోయిన కారణంగా బుధవారం తెల్లవారు జామున చనిపోయారు. ప్రపంచ కురు వృద్ధురాలిగా జపాన్‌కు చెందిన ఒకావా 2013లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నారు. 1898 మార్చి 5న జన్మించిన ఆమె గత పదిరోజులుగా ఆకలి మర్చిపోయిందని, కనీసం ద్రవ పదార్థాలు కూడా తీసుకోలేకపోయిందని ఆమె మనుమడు తెలిపాడు.
ఈ మధ్యే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆమె అనతికాలంలోనే తమను విడిచి వెళ్లడం బాధాకరమని అన్నారు. యూకియో అనే వ్యక్తిని 1919లో పెళ్లాడిన ఒకావాకు ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు సంతానం. భర్త యూకియో 1931లో చనిపోయాడు. ఆమెకు మనవళ్లు, మునిమనవళ్లు కూడా ఉన్నారు.