కాలి వేలే.. చేతి వేలైంది..
సిడ్నీ: ఆస్ట్రేలియా వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఓ వ్యక్తి ప్రమాదంలో చేతి బొటన వేలు కోల్పోగా అతని కాలి బొటన వేలును చేతి బొటన వేలుగా అతికించారు. పెర్త్‌కు చెందిన జాక్ మిచెల్(20) పశువుల కాపరి. అతను పనిచేస్తున్న ఫౌంహౌస్‌లో ప్రమాదవశాత్తు వేలును కోల్పోయాడు. వేగంగా దూసుకొచ్చిన ఎద్దు మిచెల్‌ను ఢీకొట్టింది. ఆ దాటికి అతని బొటన వేలు ఊడి కిందపడింది. ఇక అతని స్నేహితులు ఊడిన వేలుని ఐస్ మధ్య ఉంచి అతన్ని ఆసుపత్రికి తరలించారు.
పెర్త్ డాక్టర్లు అతని వేలు అతికించడానికి శత విధాల ప్రయత్నించారు. రెండు సర్జరీలు కూడా చేశారు. అయినా ఆ వేలు అతకపోవడంతో తదుపరి చికిత్సకు సిడ్నీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని సూచించారు. అవసరమైతే కాలి బొటన వేలిని చేతికి అతికించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి మిచెల్ అంగీకరించడంతో సిడ్నీ డాక్టర్లు విజయవంతంగా కాలి వేలిని చేతికి అతికించారు.