మొగల్తూరులో టీడీపీ నాయకులకు షాక్
నరసాపురం: నరసాపురం : మొగల్తూరులో టీడీపీ నాయకులకు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనుచరులకు షాక్ తగిలింది. పేరుపాలెం సొసైటీలో అవినీతి వ్యవహారం బట్టబయలైంది. మండలంలో ముఖ్య టీడీపీ నాయకులు కీలకంగా వ్యవహరిస్తోన్న సొసైటీలో రూ.50 లక్షల వరకూ అవినీతి జరిగిందని సహకార శాఖ చేపట్టిన విచారణలో తేటతెల్లమైంది. దీంతో పాలకవర్గాన్ని రద్దుచేసి సొసైటీకి ముగ్గురు సభ్యులతో కూడిన మేనేజ్మెంట్ కమిటీని నియమించారు. అయితే విచారణ ఇంకా సవ్యంగా సాగలేదని, మరికొందరు ముఖ్యులను తప్పించే ప్రయత్నం సాగుతోందని, ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన రైతులు, సొసైటీ మాజీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే బరితెగింపు , పేరుపాలెం సొసైటీలో రూ.1 కోటి దాటిన అవినీతి పేరుతో గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన కథనంతో ఈ అవినీతి వ్యవహారంపై కదలిక వచ్చింది. సంఘంలో జరిగిన అవినీతిపై నిస్పక్షపాతంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విచారణ జరుగుతోందని 51 విచారణ అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి.ధర్మరాజు తరువాత ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. విచారణలో భాగంగా 509 మందికి అప్పు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. విచారణలో రూ.50 లక్షల అవినీతి జరిగిందని తేల్చారు. దీంతో పాలకవర్గాన్ని రద్దుచేసి మేనేజ్మెంట్ కమిటీని నియమించారు. మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా నరసాపురం డివిజన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.రామదాసును, మొగల్తూరు డీసీసీబీ మేనేజర్, సూపరింటెండెంట్లను సభ్యులుగాను నియమించారు.
టీడీపీ నేతలకు చెంపపెట్టు
సొసైటీలో అవినీతి వ్యవహారం అధికారికంగా బయటపడటంతో మండల టీడీపీ నేతలకు చెంపపెట్టుగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు సత్యనారాయణ పాలకవర్గం రద్దయ్యింది. అలాగే ఈ వ్యవహారంలో మొదటి నుంచి వినిపిస్తున్న మరోపేరు సత్తినేని త్రినాథరావు. ఈయన మండలంలో టీడీపీకి కీలకనేత. సొసైటీ అవినీతి వ్యవహారం బయటకు రాకుండా అనేక విధాలుగా ప్రయత్నించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వీరందరికీ షాక్ తగిలినట్టయ్యింది. సొసైటీలో సభ్యులందరూ పేద రైతులు, పైగా నిరక్షరాస్యులు ఎక్కువ. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే వ్యవహారానికి ఒడిగట్టారు పేరుపాలెం సొసైటీ ప్రతినిధులు. సదరు సొసైటీ వ్యవహారాల్లో అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తోన్న టీడీపీ నేతలు తమను అడిగేవారే లేరన్నట్టుగా రెచ్చి పోయారు. సొసైటీ ద్వారా రూ.10 వేలు అప్పు ఇచ్చి తమ ఇస్టానుసారం రూ.25 వేలు, రూ.50 వేలు ఇచ్చినట్టుగా రాసేసుకున్నారు.
అప్పుదారులకు కనీసం రుణమాఫీ సొమ్ము కూడా దక్కకుండా చాలాకాలంగా చీకటి తతంగాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. చివరకు చనిపోయిన వారి పేరు మీద కూడా అప్పులు తీసుకున్నట్టుగా పత్రాలు సృష్టించారు. మీ పేరులతో వేలల్లో బకాయిలున్నాయి, అప్పులు కట్టండంటూ సొసైటీల నుంచి నోటీసులు రావడంతో రైతులు నోరెళ్లబెట్టారు. జరిగిన అన్యాయంపై పోరాటం చేసినా మొదట ప్రయోజనం లేకపోయింది. 51 విచారణ వేసినా ఈ మొత్తం అవినీతి వ్యవహారాన్ని చీకటిలోకి నెట్టేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. ‘సాక్షి’ ద్వారా విషయం బహిర్గతం కావడం, రైతుల ఆందోళన పెద్దదవ్వడంతో సహకారశాఖ అధికారుల్లో చలనం వచ్చింది. చివరకు రూ.50 లక్షలు అవినీతి జరిగిందని తేల్చి చర్యలకు ఉపక్రమించారు. ఇంకా ఈ వ్యవహారంలో సొసైటీ కార్యదర్శి అందే రవికిషోర్ పాత్రపై పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మరి చివరకు మునుముందు ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, టీడీపీ నేతల తదుపరి ప్రయత్నాలు ఎలా ఉంటాయనే దానిపై సొసైటీ వర్గాల్లో చర్చ సాగుతోంది.