ఏరువాకకు శ్రీకారం
చిట్టవరంలో సీఎం పర్యటన
నరసాపురం రూరల్: పౌర్ణమి ఏరువాక కార్యక్రమానికి నరసాపురం మండలం చిట్టవరంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. నిర్ణీత సమాయానికంటే సుమారు రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్న సీఎం సభా ప్రాంగణం వద్ద ఎడ్లబండి ఎక్కి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో కలసి ఏరువాక కార్యక్రమం నిర్వహించే ఎంవీ రావు పంట భూమికి చేరుకున్నారు. భూమి పూజ చేసి నాగలితో అరక దున్ని సాగును ప్రారంభించారు. నారుమడుల్లో వరియంత్రం ద్వారా నాట్లు వేశారు. సంచార భూసార పరీక్షల వాహనాన్ని ప్రారంభించారు. ఎంటీయూ 1061 విత్తనాలను పంట భూమిలో వెదజల్లారు. ముందుగా సభా ప్రాంగణంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, అటవీ, మత్స్య, విద్యుత్, డీఆర్‌డీఏ అధికారులు ఏర్పాటుచేసిన స్టాల్స్ పరిశీలించారు. ఉత్తమ రైతులుగా ఎంపికైన కూనపరెడ్డి నారాయణరావు (నరసాపురం మండలం, ఎల్బీ చర్ల), భూపతిరాజు రామకృష్ణంరాజు (నాచుగుంట)ను సీఎం సత్కరించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఎరువులు, పురుగు మందుల వ్యాపారానికి లెసైన్స్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని సీఎం ప్రారంభించారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం
నరసాపురం: రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టామని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ అన్నారు. ఏరువాక సభలో తక్కువ విద్యుత్‌తో తిరిగే ఫైవ్‌స్టార్ ఫ్యాన్ల పంపిణీని తూర్పుప్రాంత విద్యుత్ సంస్థ చేపట్టింది. సీఎం ఫ్యాన్ల పంపిణీని ప్రారంభించారు. విద్యుత్ ఆదా, అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా విషయంలో పశ్చిమగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉందని భవానీ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర గనులు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ రైతుల్లో భరోసా కల్పించడానికే సీఎం ఏరువాక కార్యక్రమం చేపట్టారని అన్నారు. దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడారు. నరసాపురం ఎమ్మె ల్యే బండారు మాధవనాయుడు నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యలు పరిష్కరిస్తామంటూ వాగ్దానాలు
నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తామంటూ సీఎం హామీలు ఇచ్చారు. వశిష్ట వంతెన, కాళీపట్నం భూములు, నల్లీక్రీక్ తవ్వకం, మోడీ వంతెన పనులపై స్పందించారు.
ఎంవీ రావుకు నివాళి
నరసాపురం ప్రాంతానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఎంవీ రావు చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగులోకి అనువదించిన విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.