తెలంగాణ టీడీపీకి ఝలక్!
► టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే వివేక్
► ఒకటి రెండు రోజుల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
► దాదాపుగా ఖాళీ అవుతున్న టీ-టీడీపీ
హైదరాబాద్:
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. గ్రేటర్ పరిధిలో పార్టీ కీలకనేతగా పేరున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ సీఎం కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయన చంద్రబాబుకు తన రాజీనామా లేఖ పంపారు. టీడీపీ కార్యాలయానికి కూడా లేఖ పంపినట్లు తెలుస్తోంది. ముందుగా కొంతసేపు సీఎంతో భేటీ అయ్యి.. ఆ తర్వాత పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాబోయే ఒకటి రెండు రోజుల్లో టీఆర్ఎస్లో చేరుతారని విశ్వసనీయ సమాచారం.
మరికొందరు ముఖ్యనేతల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఎవరూ ఊహించని నేతలు కూడా టీఆర్ఎస్లో చేరుతారని అంటున్నారు. ఇదే జరిగితే.. ఇక తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఖాళీ అవుతుందని, కేవలం నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో మిగిలే అవకాశం ఉందని కొందరు నాయకులు అంటున్నారు. తెలంగాణలో మనుగడ సాగించాలంటే తాము టీడీపీలో ఉండలేమన్నది ఆ నాయకుల భావనగా కనిపిస్తోంది.
బాబు సీఎం అయిన తర్వాత..
ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తాను ఆకర్షితుడినయ్యానని ఎమ్మెల్యే వివేకానంద చెప్పారు. ప్రజలు అన్ని వర్గాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇస్తున్నారని, అందుకే తాను కూడా ఆయన వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. గతంలో కూడా తాను ఆయనతో కలిసి పనిచేశానని, ఆయన నాయకత్వంతో పనిచేస్తే ప్రజలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందని భావించి పార్టీలో చేరానని అన్నారు. టీడీపీ కూడా మంచి పార్టీయేనని, అయితే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. తెలంగాణలో సమస్యలున్నా.. బాబు మాత్రం ఏపీకే పరిమితం అయ్యారన్నారు. కేసీఆర్ నాయకత్వం బాగుందని కార్యకర్తలు కూడా అంటున్నారన్నారు.