అమ్మకు ఆలయం
అమ్మకు మించిన దైవం లేదంటారు. నవమాసాలు మోసి కని పెంచి, పెద్ద చేసిన తల్లి రుణం తీర్చుకోలేనిది. అలాంటి అమ్మ జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆమె ప్రతి రూపాన్ని ఆలయంలో ప్రతిష్టించి పూజించుకోవాలనుకంటున్నారు ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శక నిర్మాత రాఘవ లారెన్స్. నిజమే ఇప్పటికే పలువురు అనాథలకు ఆశ్రయం కల్పించి ఆదుకుంటున్న ఈయన తన పుట్టినరోజు (బుధవారం) సందర్భంగా తన తల్లికి గుడి కట్టించడానికి శ్రీకారం చుడుతున్నారు.
ఈ సందర్భంగా లారెన్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తన తండ్రి పుట్టిన ఊరు చెన్నై పూందమల్లి సమీపంలోని మెవలూర్కుప్పంలో కొంత స్థలాన్ని సేకరించి అమ్మకు ఆలయాన్ని కట్టించనున్నట్లు తెలిపారు. అమ్మ విగ్రహాన్ని రాజస్థాన్లో తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు. అమ్మ వడే ఆలయం అని తన తల్లి జీవించి ఉండగానే ఆమెకు గుడి కట్టించాలని ఆశించానన్నారు. తనను పెంచడానికి తల్లి పడ్డ కష్టాలను ఒక పుస్తక రూపంలోకి తెచ్చి వచ్చే ఏడాది తనపుట్టిన రోజు నాడు ఇదే ఆలయంలో ఆవిష్కరించనున్నట్లు రాఘవ లారెన్స్ వెల్లడించారు.