ఏపీలో కొత్త పాస్‌పోర్టు ఆఫీస్‌కు నో
జాతీయ చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో కొత్తగా పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు ఇప్పట్లో లేదని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని జాతీయ చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేశ్ కుమార్ పర్దేశీ చెప్పారు. సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో శుక్రవారం ఆయన హైదరాబాద్ కార్యాలయ అధికారి అశ్వనీ సత్తార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే తిరుపతి, విజయవాడల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్కే) ఉన్నాయని, దీనివల్ల కొత్త కార్యాలయాల అవసరం ఉండదని చెప్పారు. అయినా కొత్త కార్యాలయం ఏర్పాటు నిర్ణయం విదేశీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందన్నారు. భవిష్యత్‌లో పాస్‌పోర్ట్ క్యాంప్‌లు, మేళాలు నిర్వహిస్తామన్నారు. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే కేరళలో 13 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 4 ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు ఉన్నాయని, కానీ ఇక్కడ లేవని ‘సాక్షి’ ప్రశ్నించగా.. పర్దేశీ సమాధానం దాటవేశారు.
అమెరికా, చైనా సరసన ఇండియా
పాస్‌పోర్ట్‌ల జారీలో అమెరికా, చైనా దేశాల సరసన మనదేశం చేరినట్టు పర్దేశీ చెప్పారు. 2014లో దేశవ్యాప్తంగా 1.01 కోట్ల పాస్‌పోర్ట్‌లు జారీచేశామని, దీంతో ప్రపంచంలో ఎక్కువ పాస్‌పోర్ట్‌లు జారీచేసిన 3వ దేశంగా రికార్డులకెక్కామన్నారు. 2016 నుంచి ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తామన్నారు. రెండేళ్ల క్రితం సరోగసీ బిడ్డలకు పాస్‌పోర్ట్‌లు వివాదాస్పదమైన నేపథ్యంలో త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు.
హైదరాబాద్ నం.1
ఎక్కువ పాస్‌పోర్ట్‌లు జారీచేసిన కార్యాలయాల్లో హైదరాబాద్ ఆఫీస్ తొలిస్థానంలో ఉందని పర్దేశీ తెలిపారు. పాస్‌పోర్ట్‌ల జారీలో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో నిలిచిందని కేరళ 10 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నిలిచాయని, ఏపీ 7 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి 5వ స్థానంలో ఉందన్నారు. భీమవరంలో త్వరలోనే పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు పర్దేశీ చెప్పారు.