హైదరాబాద్లో 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు
ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ
సాక్షి, హైదరాబాద్: నగరంలో 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నెలకొల్పేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)ను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఆస్పత్రిలో 500 పడకలకు అదనంగా మరో 250 పడకలు తల్లులు, పిల్లల సంరక్షణ కోసం నిర్మించనుంది. ఎల్బీనగర్లోని విక్టోరియా మెమోరియల్ హోం, రాజేంద్రనగర్లోని మైలార్దేవ్పల్లి వద్ద, పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పక్కన, మియాపూర్ బస్ టర్మినల్ పక్కన వీటిని నిర్మించనున్నారు. ఆస్పత్రుల్లో మహిళలు, పిల్లల సంరక్షణతోపాటు ఇతర అన్నిరకాల వైద్య సేవలు అందించనున్నారు. ప్రభుత్వం నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.1,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ సొమ్మును వచ్చే బడ్జెట్లో చూపిస్తారా? లేదా? స్పష్టత రాలేదు. అయితే బ్యాంకు రుణం తీసుకోవడం ద్వారా నిధులను సమకూర్చుకోవాలని సర్కారు నిర్ణయించింది.