అందుబాట్లో ఆధునిక వైద్యం
గుంటూరు మెడికల్ : ఆధునిక వైద్యపద్ధతులను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆధునిక వసతులతో ఆస్పత్రిని ప్రారంభించడం అభినందనీయమని నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు, నగరానికి ప్రముఖ వైద్య నిపుణులు కొండబోలు బసవపున్నయ్య అన్నారు. కొత్తపేట విజయాటాకీస్ ఎదురుగా స్వాతి మల్టీస్పెషాలిటీ హాస్పటల్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బసవపున్నయ్య మాట్లాడుతూ రోగులకు మానవతా ద్పక్పథంతో వైద్యసేవలు అందించాలని, అందరికీ అందుబాటులో ఉండేలా వైద్యసేవలను తీసుకురావాలని సూచించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని వైద్యం అందించాలని సూచించారు. నగరానికి చెందిన వైద్య నిపుణులు యర్రా నాగేశ్వరరావు, మద్దినేని గోపాలకృష్ణ, పి. వి.రాఘవశర్మ, నూతలపాటి శ్రీనివాసరావు, ఎన్.కిషోర్, ఎస్ చంద్రశేఖరరెడ్డిలు పలు సూచనలు అందజేసి ఆస్పత్రిలోని పలు విభాగాలను ప్రారంభించారు.
హాస్పటల్ ఎండీ డాక్టర్ అర్థలపూడి సృజన్‌కుమార్ మాట్లాడుతూ మనదేశంలో వైద్య రంగం అభివృద్ధి చెందడంతో జీవితకాలం కూడా పెరిగి వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందన్నారు. వృద్ధులకు వచ్చే వ్యాధులకు వైద్యం చేసేందుకు యూకేలో జరియాట్రిక్ మెడిసిన్ అభ్యసించినట్లు తెలిపారు. హాస్పటల్ ప్రారంభోత్సవం సందర్భంగా 15 రోజులపాటు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ కంచర్ల రాంప్రసాద్, అర్థలపూడి నారాయణ, నూతలపాటి వెంకటరత్నం, గుళ్ళపల్లి సుబ్బారావు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.