భక్తి, జ్ఞాన కుసుమాల మాల విష్ణుసహస్రం
–వేలాది భక్తుల సమష్టి సహస్రనామ గానం
–త్రిదండి చిన్న శ్రీమన్నారాయణరామానుజ జీయరుస్వామి ఉపదేశం
రాజమహేంద్రవరం కల్చరల్ : విష్ణుసహస్రనామ స్తోత్రం జ్ఞానకుసుమాల మాల, ఒకో నామం ఒకో పారిజాత కుసుమమని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి పేర్కొన్నారు. మంగళవారం ఎస్.కె.వి.టి.డిగ్రీ కళాశాలలో శ్రీరంగధామం ఆధ్వర్యంలో జరిగిన విరాట్ విష్ణుసహస్రనామ పారాయణలో ఆయన పాల్గొని, అనుగ్రహభాషణం గావించారు. సాధారణంగా భక్తుడు భగవంతుని సన్నిధిని చేరుకోవడానికి తాపత్రయ పడతాడు, కానీ, స్వచ్ఛంద మరణాన్ని వరంగా కలిగిన భీష్ముడు ప్రాణం వదిలే సమయం కోసం నిరీక్షిస్తున్న తరుణంలో, శ్రీకృష్ణభగవానుడే స్వయంగా పాండవాగ్రజునితో అంపశయ్య మీద ఉన్న భీష్ముని వద్దకు వచ్చాడని జీయరు స్వామి వివరించారు. నేడు ప్రపంచమంతా అభద్రతాభావంలో మునిగి ఉంది. వ్యక్తుల మధ్య, మతాల మధ్య, ఒకే మతంలో విభిన్న విభాగాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదం ఊపిరి పోసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భయాలు తొలగాలంటే, ప్రేమ చిగురించాలి, మనమంతా ఒకే కుటుంబానికి చెందినవారమన్న భావన కలగాలి, విష్ణుసహస్రనామానికి ఆ శక్తి ఉన్నదని జీయరుస్వామి వివరించారు. భగవద్రామానుజాచార్యులు అవతరించిన సహస్రాబ్ధిలో మనం జన్మించడం, ఆయన్ను స్మరించుకుంటూ విష్ణుసహస్రనామాన్ని పారాయణ చేయడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. వికాసతరంగిణి ఆధ్వర్యంలో ప్రచురించిన శ్రీరామానుజ సంకీర్తన పుస్తకాన్ని జీయరు స్వామి ఆవిష్కరించారు. ప్రాచార్య శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ ఈ సృష్టిలో విష్ణుసహస్రనామాన్ని మించిన జ్ఞానపేటిక మరొకటి లేదని అన్నారు. వేయినామాలు చదవలేకపోయినవారు తొలి మూడు నామాలు చదివినా అనంత శుభఫలితాలు కలుగుతాయన్నారు. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ భగవద్రామానుజాచార్యులు ప్రపంచానికి సోషలిజం బోధించిన తొలి వ్యక్తి అని అన్నారు. త్రిదండి దేవనాథజీయరుస్వామి, పులిగొల్ళ కృష్ణమాచార్యులు, సముద్రాల రంగరామానుజాచార్యులు ప్రసంగించారు. శతావధాని అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు భాగవతంలోని పద్యాలను రాగ, భావ యుక్తంగా గానం చేశారు.
పొంగిపొరలిన భక్తిరసవాహిని
వేలాది గళాలు భక్తి పారవశ్యంతో విష్ణుసహస్రనామాలను పారాయణ చేశారు. వేదవ్యాసభారతం, అనుశాసన పర్వంలో భీష్మాచార్యుడు శ్రీకృష్ణభగవానుని సన్నిధిలో ధర్మజునికి సహస్రనామాలు వినిపిస్తే, మంగళవారం త్రిదండి చిన్న జీయరుస్వామి సన్నిధిలో, వేలాది భక్తులు సహస్రనామాలను పారాయణ చేశారు. కళాశాల ఆవరణ అంతా దేవదేవుని నామస్మరణతో మారుమోగింది.