చీటర్ చిక్కాడు
జనాన్ని ముంచడమంటే ఇంత పచ్చి మోసంగా ఉంటుందా.. ఏకంగా తాను మరణించినట్లు నమ్మించేందుకు తెగపడతారా.. అవునని రుజువుచేశాడు చీటర్ వంశీకృష్ణ. రియల్టర్ అవతారమెత్తి నమ్మిన వారిని ఫోర్జరీ సంతకాలతో నట్టేట ముంచడంతోపాటు తన కస్టమర్లను నిలువు దోపిడీ చేసిన అతని పాపం ఎట్టకేలకు పండింది. రెండున్నర ఏళ్ల అదృశ్యం తర్వాత మంగళవారం రాత్రి పోలీసులకు చిక్కాడు. వంశీకృష్ణ పాపాల పుట్ట పగిలి మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
విజయవాడ : అతను కమిషనరేట్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ పర్సన్... రెండున్నర సంవత్సరాలుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. ఎట్టకేలకు సూర్యారావు పేట పోలీసులకు చిక్కాడు. కస్తూరిబాయిపేటలోని ఒక ఆస్పత్రికి చికిత్స కోసం రాగా.. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అయితే అతనే కావాలని లొంగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అతనిని సూర్యారావు పేట పోలీసులు విచారణ చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక మందిని కోట్ల రూపాయలకు ముంచేసి అదృశ్యమైన వీనస్ బిల్డర్స్ యజమాని నార్ల వంశీకృష్ణ 2011 జనవరి 4వ తేదీ నుంచి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. 2011 జనవరి 4వ తేదీన వంశీకృష్ణ కారు గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో పంట కాలువలో పల్టీ కొట్టింది. ఆ ప్రమాదంలో వంశీతోపాటు అతని తల్లి కూడా గల్లంతైనట్లు అందరూ భావించారు. కాలువలో ఎంత గాలించినా వారి మృతదేహాలు దొరక్కపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి తాను చనిపోయినట్లు నమ్మించడం కోసం కారును కావాలనే కాలువలోకి పల్టీ కొట్టించి వంశీ కనపడకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్లు తేలింది. దీంతో అతన్ని నమ్మి లక్షల రూపాయలకు ప్లాట్లు కొన్నవారు, అడ్వాన్సులు ఇచ్చినవారు ఆందోళన చెందారు.
తొలుత దీనిపై కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు పట్టించుకోలేదు. అయితే బాధితులందరూ నగరానికి చెందినవారే కావడంతో చివరికి పోలీసులు ఈ విషయంపై దృష్టి పెట్టి వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇతనిపై నగరంలోని వన్‌టౌన్, కృష్ణలంక, మాచవరం పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల పోలీస్ స్టేషన్లోనూ పలు కేసులున్నాయి. ప్లాట్లు కొనిపించడం ఆ తర్వాత వారికి తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకులో రుణాలు తీసుకోవడం, ఒకే ప్లాటును ఇద్దరు, ముగ్గురికి విక్రయించడం వంటి మోసాల ద్వారా వంశీకృష్ణ కోట్ల రూపాయలు మింగేశాడని పోలీసుల విచారణలో తేలింది.
సాధారణంగా ఒక బ్యాంకు లోనులో ఉన్న ప్లాటుకు మరొక బ్యాంకు లోను ఇవ్వదు. కానీ కొందరు బ్యాంకు అధికారులను మేనేజ్ చేయడం ద్వారా లోన్లు ఉన్న ప్లాట్లకే మళ్లీ లోన్లు ఇప్పించినట్లు తెలుస్తోంది. రెప్కో, యూనియన్ బ్యాంకులతోపాటు మరికొన్ని బ్యాంకుల ద్వారా రెండోసారి ఇవి మంజూరు చేయించినట్లు సమాచారం. బాధితుల్లో కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన ఒక సీఐ రియల్టర్ వంశీకష్ణకు రూ.5 కోట్లకుపైనే ఇచ్చిన విషయం బయటకొచ్చింది. ఇంతేకాకుండా గతంలో జిల్లా పోలీస్ బాస్ కూడా ఇతని వలలో పడినట్లు పోలీసువర్గాలే చెబుతున్నాయి. గుడ్డిగా నమ్మి ప్లాట్లు కొనడంతోపాటు కొందరు అతని పేరిట పవర్ ఆఫ్ ఆటార్నీ ఇచ్చి నిండా మునిగిపోయినట్లు తేలింది.
పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న ప్లాటును అతను వేరొకరికి రిజిస్టర్ చేసి బ్యాంకు రుణాన్ని మాత్రం వారి పేరుతో తీసుకున్నాడు. దీంతో పలువురు ప్లాటు తమది కాకపోయినా బ్యాంకులకు వాయిదాలు కడుతున్నారు. ఇలా రూ.100 కోట్లకుపైనే అతను పలువుర్ని ముంచేశాడు. ప్లాట్ల పేరుతో అనేక మందికి టోపీ పెట్టి, చివరికి వ్యాపార భాగస్వాములను సైతం నట్టేట ముంచి అదృశ్యమైన నార్ల వంశీకృష్ణ మోసాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వ్యాపారం చేద్దామని నమ్మించి జాయింట్ ఎకౌంట్లో ఉన్న రూ.80 లక్షల్ని తన సంతకం ఫోర్జరీ చేసి డ్రా చేసినట్లు చలసాని మైథిలి మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సిద్ధార్థ మెడికల్ హెల్త్‌కేర్ అండ్ హోల్డింగ్స్ పేరుతో వ్యాపారం కోసం రూ.కోటిని వంశీకృష్ణ, మైథిలి కలిసి గవర్నర్‌పేట ఇండియన్ బ్యాంకులో జమ చేశారు. ఆ డబ్బు డ్రా చేయాలంటే ఇద్దరూ సంతకాలు చేయాలి. అయితే వంశీయే చెక్కుపై మైథిలి సంతకాన్ని కూడా చేసి రూ.80 లక్షల్ని డ్రా చేశాడు. ఇందుకు బ్యాంకు అధికారులు కూడా సహకరించినట్లు మైథిలి ఫిర్యాదులో పేర్కొంది. భవానీపురంలో తులసి ఎన్‌క్లేవ్‌ను వంశీ, శ్రీనివాసరావు కలిసి నిర్మించారు. అయితే ఆ తర్వాత శ్రీనివాసరావుకు తెలియకుండా అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి వంశీ దానిపై రూ.కోటిన్నర రుణం తీసుకున్నాడు.
ఇందుకు ఒక పోలీసు అధికారి తన ఆస్తులను ష్యూరిటీగా పెట్టారు. దీనిపై శ్రీనివాసరావు వన్‌టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసూ పెండింగ్‌లోనే ఉంది. అతను దొరకడంతో ఇంకా చాలా విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మ్యాన్ మిస్సింగ్ కేసు ఉండటంతో పోలీసులు నేడు గుంటూరు జిల్లాకు తరలించే అవకాశం ఉంది.