పద్మశ్రీ పురస్కారం.. దళిత జాతికే గర్వకారణం
బయోడేటా
పూర్తి పేరు: నర్రా రవికుమార్
చదువు:బీఎస్సీ, ఎల్ఎల్ఎం, డీజే;డీపీఆర్
వృత్తి: శాంతి చక్ర అసోసియేట్ మేనేజింగ్
ైడెరైక్టర్, ఆదిత్య కమ్యూనికేషన్ భాగస్వామి,అధ్యక్షుడు దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారతదేశ కోఆర్డినేటర్.
తల్లిదండ్రులు : శంకరయ్య, సుశీల
భార్య : వనజాక్షి (ఎంకాం, ఎంఐఎస్సీఏ)
కుమారులు: ఆదిత్య రిత్విక్ (ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం, ఎన్ ఐటీ, వరంగల్)
ఆదిత్య రోహన్: (9వ తరగతి, భారతీయ విద్యాభవన్ సైనిక్ పురి)
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు.. అని ఓ సినీకవి చెప్పినట్లుగా ఆయన అంచలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగంలోని ఓ దళితుడు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. తనకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం రావడం దళితులు వ్యాపార రంగంలోనూ ఎదుగుతున్నారనే సందేశం సమాజం దృష్టికి వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన మరెరో కాదు పద్మశ్రీ నర్రా రవికుమార్.
శాంతి చక్ర ఇంటర్నేషనల్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో ప్రతి యేటా జనవరి 26న నిర్వహించే ‘ప్రబుద్ధ భారత్ ఉత్సవ్- 2014’ను ఆదివారం శామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్స్‌లో జరిపారు. పద్మశ్రీ అవార్డు లభించిన సందర్భంగా నర్రా రవికుమార్ ‘న్యూస్‌లైన్’తో ముఖాముఖి మాట్లాడారు. దళితులు అభివృద్ధి సాధిస్తేనే దేశం మరింత అభ్యున్నతి సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డు ద ళిత జాతికే గర్వకారణంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
న్యూస్‌లైన్: మీరు పుట్టి పెరిగిన స్థలం.. కుటుంబ నేపథ్యం చెబుతారా..?
నర్రా రవికుమార్: మాది సికింద్రాబాద్‌లోని మారెడ్‌పల్లిలోని భూసారెడ్డిగూడ. మధ్యతరగతి కుటుంబం. మా అమ్మానాన్న నర్రా శంకరయ్య, సుశీల. నాన్న తాపీమేస్త్రీ. నేను 01.09.1963లో జన్మించా. నా విద్యాభ్యాసమంతా మారెడుపల్లిలోనే సాగింది.
న్యూ: ఈ స్థాయికి మీరెలా ఎదిగారు?
న.ర.: నాకు చిన్నతనం నుంచే వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించాలనే పట్టుదల ఉండేది. దీంతో పాటు సేవా భావాలు కల్గి ఉండేవాడిని. ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలను ఎదిగాను. రాజకీయాల్లోనూ ప్రవేశం ఉండటంతో అనతి కాలంలోనే అన్ని రంగాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నతస్థాయికి చేరుకున్నా. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అంచలంచెలుగా ఎదుగుతూ ద ళితుల అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడ్డా. నా సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇది దళితజాతి గర్వించదగిన విషయం.
న్యూ: దళితులు అభ్యున్నతి కోసం మీరిచ్చే సూచనలు, సలహాలు?
న.ర.: దళితులు అంటే.. ప్రభుత్వంపై ఆధారపడి జీవనం సాగించేవారనే అపోహను రూపుమాపాల్సిన అవసరం ఉంది. అవకాశాలు వస్తే దళితులు దేనికీ తీసిపోరు. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి దేశ ప్రగతిలో భాగస్వాములు కాగలుగుతారు. ప్రస్తుత భారత దేశంలో దళిత్ క్యాప్టలిజాన్ని ప్రోత్సహించాల్సి ఉంది.
ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు పరంగా విద్య, నైపుణ్యం, పెట్టుబడి, ఉత్పత్తులకు మార్కెటింగ్లాంటి సదుపాయాలు కల్పించడంతోనే ఎవరూ ఊహించని విధంగా అమెరికా ఆర్థికంగా అభివృద్ధి చెందింది. భారత్ సుసంపన్న దేశంగా ఎదగాలంటే దళితుల పురోభివృద్ధి ఎంతో అవశ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగ అవకాశాలు రోజురోజుకీ తగ్గిపోతున్న ప్రస్తుత సందర్భంలో దళిత జాతి కూడా వ్యాపార, వాణి జ్య, పారిశ్రామిక రంగాలపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది.
న్యూ: మీ మార్గదర్శకులు ఎవరు?
న.ర.: బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నా మార్గదర్శకుడు. ఆయన చూపిన మార్గంలో పయనించడంతో పాటు నాతో పాటు పలువురికి దారి చూపడం నా కర్తవ్యంగా భావిస్తున్నా.