గ్రామాల్లో సంప్రదాయ విత్తన బ్యాంకులు
బహుళజాతి హైబ్రీడ్కు అడ్డుకట్ట జాతీయ జీవ వైవిధ్య మండలి నిర్ణయం
హైదరాబాద్: వ్యవసాయంలో విత్తనం అత్యంత కీలకం. సంప్రదాయ విత్తనాల తయారీ వ్యవస్థ ధ్వంసమవడంతో అన్ని రకాల విత్తనాల కోసం రైతు బహుళజాతి సంస్థలు, ఇతర కంపెనీలపై ఆధారపడాల్సి వస్తోంది. పైగా హైబ్రీడ్ వంగడాలను సృష్టించి రైతులకు మరో గత్యంతరం లేకుండా చేస్తున్నాయి. విత్తనాల కోసం ప్రతిసారి తమ వద్దకే రావాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇక పురుగుమందులు, ఎరువులను సకాలంలో వాడితేనే దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో రైతుకు పంటల పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. మరోపక్క పర్యావరణం, జీవ వైవిధ్యం దిబ్బతింటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు జాతీయ జీవవైవిధ్య మండలి నడుం బిగించింది. సంప్రదాయ విత్తనాలను అందుబాటులోకి తెచ్చి బహుళజాతి హైబ్రిడ్ విత్తన వ్యవస్థకు చరమగీతం పాడాలని నిశ్చయించుకుంది. రెండేళ్లలో తెలంగాణవ్యాప్తంగా కనీసం 400 గ్రామాల్లో సంప్రదాయ విత్తన బ్యాంకులను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇందులో మొదటగా ఆదిలాబాద్ జిల్లాను, అందులోనూ తొలుత ఐదు గ్రామాలను ఎంపిక చేసింది.
వ్యాపారం కాదు... ఇచ్చిపుచ్చుకునే పద్దతి
ఇప్పటివరకు 50 రకాల సంప్రదాయ విత్తనాలను జీవ వైవిధ్య మండలి సేకరించింది. వాటిలో వరి, జొన్న, సజ్జ, రాగులు, అవిసెలు వంటి ధాన్యపు వంగడాలు, దేశీయ వంకాయ, టమాట, బెండకాయ తదితర కూరగాయలు, రకరకాల పూలకు సంబంధించిన విత్తనాలు ఉన్నాయి. ఒక్క వంకాయలోనే వెయ్యి రకాల దేశీయ రకాలు ఉండటం విశేషం. సంప్రదాయ సుగంధ, ఔషధ మొక్కలు, మామిడి, సపోట, నేరేడు, పనాస వంటి పండ్ల విత్తనాలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక దేశీయ విత్తనాలను సేకరించేందుకు జీవ వైవిధ్య మండలి కృషి చేస్తోంది. ఇందుకోసం ఇక్రిశాట్, ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫ్లాంట్ జెనటిక్ రిసోర్సెస్(ఎన్బీపీజీఆర్) వంటి సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఆయా సంస్థల వద్ద సంప్రదాయ విత్తన నమూనాలు జాగ్రత్తగా ఉన్నాయి. వాటిని కూడా సేకరించి.. అన్ని రకాల వంగడాలను గ్రామ సంప్రదాయ విత్తన బ్యాంకులకు చేరవేస్తారు. గ్రామ సర్పంచి చైర్మన్గా, మరో ఇద్దరు మహిళా సభ్యులతో ఏర్పాటయ్యే కమిటీనే ఈ విత్తన బ్యాంకుల నిర్వహణ బాధ్యత తీసుకుంటుంది. ఒక్కో విత్తన బ్యాంకు ఏర్పాటుకు దాదాపు రూ. లక్ష ఖర్చవుతుందని అంచనా. ఆ డబ్బుతో విత్తనాల సేకరణ, ఒక షెడ్డు, నిల్వ ఏర్పాటు వంటివి సమకూర్చుతారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ నిధులను జీవ వైవిధ్య మండలే సమకూర్చుతుంది. ఈ విత్తన బ్యాంకుల ద్వారా దేశీయ విత్తనాలను రైతులకు అందజేస్తారు. ఎన్ని కేజీల విత్తనాలు తీసుకుంటే వాటికి రెట్టింపు విత్తనాలను పంట పండించాక ఈ బ్యాంకుకు రైతు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతావి అమ్ముకోవచ్చు. విత్తన బ్యాంకులు వ్యాపారం చేయవు. ఈ విత్తనాలతో పండించే పంటలకు సేంద్రీయ ఎరువులు, వర్మికంపోస్టు వంటివి మాత్రమే వాడేలా చేస్తారు.