'ఇందు సర్కార్ రిలీజ్‌పై స్టే ఇవ్వండి'
బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌కు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన 21 నెలల ఎమర్జెన్సీ నేపథ్యంలో రూపొందిన 'ఇందు సర్కార్' చిత్రం విడుదలపై ప్రియా సింగ్ పాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ముంబై హైకోర్టు ప్రియా వాదనను తోసి పుచ్చటంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంజయ్‌గాంధీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిష్ఠను దిగజార్చేలా సినిమా ట్రయిలర్ ఉందని, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని, సినిమా విడుదలపై స్టే విధించాలని కోరింది.
ఇటీవల.. ఇందిరాగాంధీ చిన్న కొడుకు, దివంగత కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ తన తండ్రి అని ప్రియాసింగ్ పాల్ అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 12 కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ముంబై హైకోర్టు సైతం స్టే ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ముందుగా అనుకున్న ప్రకారమే ఈనెల 28న 'ఇందు సర్కార్' ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు. కానీ మరోసారి ప్రియా సింగ్ పాల్ కోర్టును ఆశ్రయించటంతో ఇందు సర్కార్ రిలీజ్ పై చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు.