ప్రహసనంగా మారిన ఉద్యోగుల బదిలీలు
మంత్రులు, పైరవీ కారుల అవసరాల కోసమే మార్పులు
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఎవరి అవసరం ఆధారంగానో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమానికి ఎటువంటి అవరోధం లేకుండా అవసరం ఆధారంగా (నీడ్ బేస్డ్) బదిలీలకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఈ నెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనపరమైన లేదా ఆయా ఉద్యోగుల భార్య-భర్తల కేసుల్లోను, లేదా వైద్య సమస్యల కేసుల్లోను అనేది అవసరం ఆధారంగా బదిలీలు అనేది వర్తిస్తుందనేది ప్రభుత్వ అభిప్రాయం. ఇప్పుడు మాత్రం మంత్రులు, పైరవీ కారుల అవసరం కోసంగా బదిలీలు మారిపోయాయని ఉద్యోగ వర్గాలే కోడై కూస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులకు, కొంతమంది ఎమ్మెల్యేలకు ఆదాయ వనరుగా బదిలీల ప్రహసనం మారిందని ఉద్యోగ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల మినహాయించి జిల్లా, జోనల్ స్థాయి కేడర్ పోస్టుల బదిలీలకు అనుమతించారు. ఈ నెల 15వ తేదీతో బదిలీలకు గడువు ముగుస్తుండటంతో ప్రస్తుతం మంత్రుల కార్యాలయాలు, నివాసాల్లో అంతా ఈ తతంగమే సాగుతోంది. సంబంధిత శాఖనుంచి ప్రతిపాదనలు రాకుండానే మంత్రుల పేషీల్లో సిబ్బందే బదిలీలకు సంబంధించిన ఉద్యోగుల పేర్లతో జాబితాలను తయారు చేస్తున్నారు. ఎవరు ఎక్కువ ముట్టచెబితే వారికి కావాల్సిన చోటకు బదిలీలు చేయనున్నారు. దీంతో ఏడాది క్రితం బదిలీ అయ్యి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా స్థానచలనం కలుగుతోంది. దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారినే బదిలీ చేస్తారు. ఈ ప్రహసనంలో ఉపాధ్యాయులు కూడా ఉంటున్నారు. నవంబర్ నెలలో టీచర్లను బదిలీలు చేయడం అంటే విద్యార్థులకు చదువు ఇక ఎలాగ ఉంటుందో ఆలోచించవచ్చునని ఉద్యోగ వర్గాలే పేర్కొంటున్నాయి.