మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల వెల్లువ
- ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 840
- నేటితో మద్యం టెండర్ల ప్రక్రియ పూర్తి
- 23న జిల్లా కేంద్రంలో లాటరీ
నల్లగొండ : కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురు, శుక్రవారాలు మంచిరోజులు కావడంతో వ్యాపారులు దుకాణాలు దక్కించుకునేందుకు పెద్దఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు. కాగా శనివారంతో టెండర్ల స్వీకరణ గడువు పూర్తికానుంది. అయితే కొత్త మద్యం పాలసీ ఏడాది మాత్రమే కావడంతో గత రెండేళ్ల పాలసీతో పోలిస్తే ఈసారి దరఖాస్తులుకొంత తగ్గే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రికి అందిన వివరాల మేరకు జిల్లాలో 253 దుకాణాలకు ఇప్పటివరకు 840మంది వ్యాపారులు దరఖాస్తు చేశారు.
వీటిలో నల్లగొండ ఈఎస్ పరిధిలోని 166 దుకాణాలకు 553, మిర్యాలగూడ ఈఎస్ పరిధిలోని 89 దుకాణాలకు 287 దరఖాస్తులు వచ్చాయి. ఇది లా ఉంటే గడిచిన రెండేళ్ల లాభనష్టాలను కూడా బేరీ జు వేసుకుని వ్యాపారులు ఆచితూచి దరఖాస్తు చేస్తున్నారు. ఈ ఏడాది పాలసీలో కొద్దిపాటి మార్పులు తప్ప పెద్దగా వ్యాపారులకు లాభసాటిగా అనిపించే విధంగా లేకపోవడంతో సిండికేట్గా ఏర్పడి దరఖాస్తులు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం దరఖాస్తులను క్రోడీకరించి 23వ తేదీన జిల్లాకేంద్రంలో లాటరీ తీయనున్నారు.