గోద్రెజ్‌లో కీలక మార్పు: కొత్త వారసురాలు
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రెజ్ (75)తన వారసత్వ నాయకత్వాన్ని మంగళవారం ప్రకటించారు. గోద్రెజ్ గ్రూపునకు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీని తన కుమార్తెకు అప్పగించారు. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను కుమార్తె నిసాబా(39)కు అందజేశారు. దీంతో 17 ఏళ్ళ పాటు కంపెనీకి నాయకత్వం వహించిన ఆది గోద్రెజ్ ఇక మీదట గౌరవ చైర్మన్‌గా ఉంటారు. రెండు నెలల క్రితం ఛైర్మన్‌గా ఆది గోద్రెజ్ రాజీనామా అనంతరం ఈ కీలక మార్పు చోటు చేసుకుంది.
ప్రస్తుతం కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్ననిసాబా ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మే 10, 2017నుంచి అమల్లోకి రానుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అతిపెద్ద కంపెనీకి అధిపతి గా వ్యవహరిస్తున్న అతి చిన్న వయస్కురాలిగా నిసాబా నిలిచారు. తన తండ్రి క్రమశిక్షణ, ఫలితాలపై దృష్టి, వినయపూర్వకమైన విధానం తమ గ్రూపు డీఎన్ఏలో ఎల్లప్పుడూ ప్రధానంగా ఉంటుందని నిసాబా వ్యాఖ్యానించారు.
అలాగే తాను జీఎస్పీఎల్ బోర్డులో కొనసాగుతాననీ, కంపెనీ ఎండీ, సీఈవోగా వివేక్ గంభీర కొనసాగుతారని ఆది గోద్రెజ్ ప్రకటించారు. జిసిపిఎల్ పునాదులు ఎంతో బలంగా ఉన్నాయనీ, ఇది కొత్త చైర్పర్సన్ కు బదిలీ చేయడానికి అనువైన సమయమని చెప్పారు. నిసాబా నాయకత్వంలో సంస్థ అభివృద్ధి దిశగా పయనిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వినియోగదారుల వస్తువులు, రియల్ ఎస్టేట్, గృహోపకరణాలు, వ్యవసాయ రంగాలతో సహా వివిధ రంగాలలో సేవలందిస్తున్న ఉన్న గోద్రెజ్ గ్రూప్ లోని ప్రధాన సంస్థ జీసీపీఎల్. 2007 లో ప్రారంభించిన సంస్థ యొక్క అభివృద్ధిలో నిసాబా మాస్టర్ మైండ్ కీలకం. ముఖ్యంగా దేశీయ సేంద్రీయ వృద్ధి ఆవిష్కరణ, స్థిరీకరణ ద్వారా సంస్థను పరుగులు పెట్టించారు. అదే సమయంలో భారతదేశం బైట అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా జీపీసీఎల్ ప్రపంచవ్యాప్తమైంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో 2011 నుంచి పనిచేస్తున్న నిసాబా గత దశాబ్దంలో కంపెనీ వ్యూహంలో మరియు పరివర్తనలో నిసాబా కీలక పాత్ర పోషించారు. ఈ కాలంలో సంస్థ క్యాపిటలైజేషన్ 20రెట్లు అధిగమించింది. రూ. 3వేలకోట్ల నుంచి రూ.60వేల కోట్లకు చేరింది. అలాగే జనవరి మార్చ్ త్రైమాసికంలో అద్భుతమైన లాభాలను ప్రకటించింది. మార్చి 31, 2017 ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో జీసీపీఎల్ రూ. 9,608 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇది రూ. 8,753కోట్లుగాఉంది.
కాగా ఆది గోద్రెజ్ ముగ్గురు సంతానంలో నిసాబా రెండవవారు. అతి పెద్ద కుమార్తె తాన్య దుబాష్ గోద్రేజ్ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు కల్పెష్ మెహతాను వివాహం చేసుకున్నారు. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు.