గర్భిణి భార్యను మోసుకుని ఆస్పత్రికి..
రాయ్‌గఢ్ (భువనేశ్వర్):
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో గర్భవతి అయిన భార్యను మోసుకుని ఆస్పత్రికి తీసుకువచ్చిన ఘటన ఒడిశాలోని రాయ్‌గఢ్ జిల్లా కల్యాణసింగుపురం సమితిలో జరిగింది. కల్యాణసింగుపురానికి 6 కిలోమీటర్ల దూరంలో గల రాబుగుడ గ్రామానికి చెందిన అర్జునకురి భార్య రుయమణి గర్భిణి. ఆమె జ్వరంతో బాధపడుతుండడంతో భార్యను మోసుకుని ఆస్పత్రికి తీసుకువచ్చాడు.
దీనిపై సీడీఎంఓ డాక్టర్ ఆనందకుమార్ పాడిని వివరణ కోరగా, రబుగుడ గ్రామానికి వెళ్లేందుకు రహదారి లేదని తెలిపారు. రుయమణిని సైకిల్‌పై కూర్చోబెట్టి ఆస్పత్రి వరకు తీసుకువచ్చారని, ఆస్పత్రి ప్రాంగణం నుంచి లోపలికి మోసుకుని తీసుకువచ్చారని తెలిపారు. ఆమెకు వైద్యసేవలందించామని, ప్రస్తుతం జ్వరం తగ్గిందని, కోలుకుంటోందని తెలిపారు. కల్యాణసింగుపురం జిల్లాకేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.