ఎన్ఎస్ఈఎల్ కేసుల కోసం స్పెషల్ కోర్టులు
న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజి లిమిటెడ్‌కు సంబంధించిన అన్ని కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాధాన్యతా క్రమంలో విచారించే ఉద్దేశంతో త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్టు ఆదివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో రూ 5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ కుంభకోణం కేసులో త్వరిత గతిన విచారణ పూర్తి చేయాలని యోచిస్తున్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్ఎస్ఈఎల్ స్కాంకు సంబంధించి వివిధ విచారణ సంస్థలు అందజేసిన నివేదికల పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతదేశం యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (సెబీ) లు ఎటాచ్ చేసిన ఆస్తులు వేలం వేగవంతం చేసి ఆయా పెట్టుబడిదారులకు వాపసు చేయాలని కోరింది. అలాగే ఎన్ ఎస్ ఈఎల్, ఎఫ్ టీఐఎల్ విలీనం ప్రక్రియను వేగవంతం చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సూచించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈవోడబ్ల్యూ ఎటాచ్ చేసిన ఆస్తుల అమ్మకాలకు రంగం సిద్ధం చేసినట్టు తెలిపింది. మహారాష్ట్ర గెజిట్ లో నోటిఫై చేసిన సుమారు 6,115 కోట్ల రూపాయలు విలువచేసే 711 ఆస్తులను వేలం వేయనునుట్టు తెలిపింది. ఇప్పటివరకు ఎంపీఐడీ చట్టం ప్రకారం 7,063 కోట్ల రూపాయల విలువచేసే 831 ఆస్తులను ఎటాచ్ చేసినట్టుతెలిపింది. కాగా ఎఫ్ టీఐఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షాను అరెస్ట్ చేసిన ఈడీ ఆగస్గు 1 వరకు రిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.