‘ఇన్పుట్’ కోసం అధికారుల నిర్బంధం
అమడగూరు: ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం వారంతా మండల కేంద్రంలోని వ్యవసాయాధికారి కార్యాలయానికి చేరుకుని ఏఓ కవితారాణి, ఇతర సిబ్బందిని దాదాపు 4 గంటల పాటు నిర్బంధించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, నెల రోజులుగా తిరుగుతున్నా ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము ఖాతాల్లో వేయకుండా రేపు, మాపు అంటూ తప్పించు కుంటున్నారంటూ మండిపడ్డారు. తమ సమస్య పరిష్కరించే దాకా ఇక్కడ నుండి కదిలేది లేదన్నారు.
ఐదెకరాలకు పైగా భూమి ఉన్నా... రూ.4 నుంచి రూ.5 వేలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేశారనీ, అలాగే కొందరికి రూ.30 వేలు మేర ఇన్పుట్ సబ్సిడీని ఖాతాల్లో వేసినా... ఆ తర్వాత వాటిని బ్లాక్ చేయించి అందులో నుంచి తిరిగి సగం డబ్బులు వెనక్కి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో ఏం చేయాలో తెలియని ఏఓ కవితారాణి వెంటనే జేడీఏకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. జేడీఏ ఆదేశాల మేరకు తక్కువగా డబ్బులు పడిన వారి పేర్లను నమోదు చేసుకుని వారం రోజుల్లోగా అందరికీ డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి ఆందోళనను విరమించారు.