తల్లిని రక్షించుకునేందుకు పిల్లల పోరాటం!
మధురై: ఒమన్‌లో నరకయాతన పడుతున్న తమ తల్లిని అక్కడి దుర్మార్గుడి చెర నుంచి రక్షించాల్సిందిగా ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు. సోమవారం మధురైలో అభినయ (13), రాహుల్ (11) అనే ఇద్దరు చిన్నారులు ఒమన్‌లో యాజమాని బారి నుంచి తమ తల్లిని కాపాడి తమ వద్దకు పంపించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఒమన్‌లో ఉద్యోగం ఇచ్చిన యాజమాని తమ తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ ఆ ఇద్దరు చిన్నారులు వాపోయారు. వివరాల్లోకి వెళితే.. కుటుంబ పోషణకై ఉద్యోగం నిమిత్తం మేకాల అనే మహిళ ఇటీవల ఒమన్‌కు వెళ్లింది. తన భర్త ఓ ప్రమాదంలో కాలు కోల్పోవడంతో కుటుంబం భారం తనపై పడింది. దాంతో ఆమె మూడు నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా ఒమన్‌కు వెళ్లి ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని పోషిస్తోంది.
మదురైలోని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ వీరరాఘవరావును కలిసిన చిన్నారులు ఇద్దరు ఆయన ఎదుట బోరుబోరున విలపిస్తూ మోరపెట్టుకున్నారు. తల్లి మేకాల ఒమన్‌లో ఉండగా, పిల్లలు ఇద్దరూ తమ నాయనమ్మ వద్దే ఉండి చదువుకుంటున్నారు. ఒకరోజు తమ పిల్లలకు తల్లి మేకాల ఫోన్ చేసి జరిగిన విషయాన్ని అంతా చెప్పింది. యాజమాని తనను చిత్రహింసలు పెడుతూ కనీసం ఆహారం కూడా ఇవ్వకుండా హింసిస్తున్నాడంటూ చెప్పింది. ఇదే విషయాన్ని చిన్నారులు అధికారులకు చెప్పడంతో వారు తప్పకుండా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.