మాకు ఒక్క బిడ్డే చాలు....
బీజింగ్: చైనాలో కుటుంబానికి ఒక్కరే బిడ్డ అనే వివాదాస్పద చట్టాన్ని సవరించి ఇద్దరు బిడ్డలను కనేందుకు అవకాశం ఇస్తున్నామని చైనా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ప్రజల నుంచి అనుకూల స్పందన పెద్దగా లేదు. చైనాకు చెందిన ‘సినా’ న్యూస్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో కేవలం 29 శాతం మంది ప్రజలు మాత్రమే రెండో బిడ్డను కనేందుకు ఆసక్తి చూపారు. 71 శాతం మంది ఒక బిడ్డే చాలని చెప్పారు. 1, 66,000 మంది అభిప్రాయాలను సేకరించగా వారీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రెండో బిడ్డను కావాలని కోరుకుంటున్న వారిలో కూడా ఎక్కువ మంది సంపన్న వర్గాల వారే ఉన్నారు. కేవలం ఆర్థిక కారణాల వల్లనే తాము రెండో సంతానం వద్దనుకుంటున్నామని 71 శాతం మంది చెప్పారు.
రెండో సంతానం కన్నా ఓ ఫ్లాట్, ఓ కారు కొనుక్కునేందుకే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బీజింగ్, షాంఘైలాంటి నగరాల్లో ఓ పాపను పెంచాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని వారంటున్నారు. ఒకే సంతానం అనే నిబంధనను ఎత్తివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విద్యావేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. 1979 నుంచి ఒకే సంతానం అనే చట్టాన్ని కఠినంగా అమలు చేయడం వల్లన ప్రజలు కూడా ఆ విధానానికే అలవాటు పడిపోయారని, పైగా చైనా ప్రజల్లో ఫర్టిలిటి రేటు కూడా ఇప్పడు గణనీయంగా పడిపోయిందని వారు తెలిపారు. 1950లో చైనా ప్రజల్లో 6.6 శాతం ఉన్న ఫర్టిలిటీ రేటు ఈ ఏడాదికి 1.2 శాతానికి పడిపోయిందని వారు చెప్పారు.
దేశంలో నానాటికి పడిపోతున్న యువతరాన్ని పెంచడం కోసం రెండోసంతాన భాగ్యాన్ని కల్పిస్తున్నామంటున్న ప్రభుత్వం అంచనాలు తలకిందులయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండో సంతానం కనేందుకు రెండేళ్ల క్రితమే అనుమతించినప్పటికీ పది శాతం మంది కూడా రెండో సంతానానికి ఉత్సాహం చూపకపోవడమే ఇందుకు ఉదాహరణని వారన్నారు. ప్రమాదాల్లో ఉన్న ఒక్క సంతానాన్ని కోల్పేయిన వారుమాత్రమే మరో సంతానం కోసం ముందుకొచ్చారని వారు తెలిపారు.