పేలనున్న ఉల్లి బాంబు!
* నిండుకున్న నిల్వలు
* రెండు నెలలు ఇదే పరిస్థితి
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: ఉల్లి బాంబు మళ్లీ పేలనుంది. దేశంలో ఉల్లి నిల్వలు నిండుకోవడంతో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య తీవ్ర వ్యత్యాసం నెలకొంది. దేశంలో ఉల్లి అవసరాలను ప్రస్తుతం ఒక్క మహారాష్ట్ర మాత్రమే తీరుస్తోంది. ఈ సమయానికి అక్కడ ఉల్లి నిల్వలు నిండుగా ఉండాలి. అకాల వర్షాలు, తుపాన్ల కారణంగా ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. ముందుగా పంట చేతికొచ్చిన రైతులు గోదాముల్లో నిల్వచేశారు. ఆలస్యంగా వచ్చిన పంటలో ఎక్కువశాతం దెబ్బతింది.
యూఏఈ వంటి దేశాలకు ఎగుమతుల ఒప్పందం కారణంగా నాణ్యమైన సరుకును అక్కడికి పంపించారు. నాణ్యత కలిగిన సరుకులు పోను మిగిలిన మూడో రకం ఉల్లిపాయలు దేశంలోని అన్ని మార్కెట్లకు మహారాష్ట్ర నుంచి వెళుతున్నాయి. స్థానిక అవసరాల నిమిత్తం వీటిని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కర్నూలు నుంచి రెండో పంట ఉల్లి ఏప్రిల్ నెలాఖరు వరకు వచ్చింది. మహారాష్ట్ర నుంచి తక్కువ సరుకులు వచ్చినా, కర్నూలు ఉల్లి అందుబాటులో ఉండటంతో రాష్ట్రంలో ధరలపై ఆ ప్రభావం పడలేదు. కర్నూలు ఉల్లి అయిపోవడంతో 10 రోజుల నుంచి మార్కెట్ అవసరాలను మహారాష్ట్ర ఉల్లి మాత్రమే తీరుస్తోంది. దీంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. గుత్త మార్కెట్లో 10 కిలోల ఉల్లిపాయల ధర పది రోజుల కిందటి వరకు రూ.70నుంచి రూ.80ఉంటే, ప్రస్తుతం రూ.170కి చేరింది. రిటైల్ మార్కెట్లో కిలో రూ.20 వరకు అమ్ముతున్నారు.
వారంలో 10 కిలోల ధర రూ.230కి పెరిగే సూచనలున్నాయని, జూలై నాటికి గుత్త మార్కెట్లో 10 కిలోల ఉల్లి రూ.300 వరకు చేరుకోవచ్చని వ్యాపారుల అంచనా. ఆగస్టు మొదటి వారం నుంచి కర్నూలు మొదటి పంట ఉల్లి మార్కెట్‌కు వస్తుంది. వర్షాలు పడితేగానీ మహారాష్ట్రలో ఉల్లి పంట వేయరు. అప్పటివరకు గోదాముల్లో ఉన్న సరుకును మాత్రమే వినియోగించాల్సి రావటం, మార్కెట్లో ఉల్లి పాయలకున్న డిమాండ్ నేపథ్యంలో ఆ ప్రభావం ధరలపై పడి వినియోగదారుల ఇంట్లో బాంబు పేలనుంది.