పింఛన్.. టెన్షన్..
మంచిర్యాల రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల కోసం చేపట్టిన ప్రక్రియ సజావుగా ముగిసినా.. ఆన్లైన్ చేసేందుకు మాత్రం తంటాలు తప్పడం లేదు. ఇటీవల కోకొల్లలుగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు అధికారులకు పెద్ద పరీక్షగా మారింది. కాగా.. గురువారం వరకు ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసి.. శుక్రవారం నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ పూర్తికాకపోవడంతో కొత్త పింఛన్ల పంపిణీ ఎలా చేసేదని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఆటంకంగా మారిన సాంకేతిక సమస్య...
గత నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆహార భద్రత, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. 22వ తేదీ నుంచి ఈనెల 2 వరకు దరఖాస్తులదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు విచారణ చేశారు. అనంతరం 3వ తేదీ నుంచి ఆ అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ చేసే పని ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ, ఇంటింటి సర్వే చేసి విచారించిన అధికారులకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేయడం పెద్ద పరీక్షగా మారింది.
తక్కువ సమయం ఉండడం, వివరాల నమోదుపై కంప్యూటర్ ఆపరేటర్లకు అవగాహన లేకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆన్లైన్లో పింఛన్ల వివరాలు నమోదు కావడంలో ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏకకాలంలో దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం ప్రారంభించడంతో ఒక్కసారిగా సర్వర్పై ఒత్తిడి పెరిగి వెబ్పేజీలో వివరాలు ఆలస్యంగా నమోదవుతున్నాయి. ఒక్కో దరఖాస్తు పూర్తయ్యేందుకు పది నిమిషాల వరకు సమయం తీసుకుంటోంది.
ఆ పది నిమిషాల తర్వాత కూడా ఆ దరఖాస్తు సేవ్ అవుతుందనే నమ్మకం కూడా లేకుండాపోయింది. ఒక్కోసారి ఒక్కో దరఖాస్తును రెండేసి మూడేసి సార్లు నమోదు చేయాల్సి వస్తోంది. వీటిని తొందరగా పూర్తి చేయాలని ఆపరేటర్లు రాత్రి, పగలు తేడా లేకుండా నాలుగు రోజులుగా కుస్తీ పడుతున్నారు. దీనికితోడు కంప్యూటర్ అవగాహన ఉన్న సిబ్బంది లేకపోవడం.. ఎక్కువ కంప్యూటర్లను సిద్ధం చేసుకోకపోవడంతోనూ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. అందుబాటులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు, మండల పరిషత్, రెవెన్యూ, ఈజీఎస్ సిబ్బందితో ఆన్లైన్లో దరఖాస్తుల నమోదును చేపడుతున్నారు.
ఒక్క రోజులో పూర్తయ్యేనా...
జిల్లాలో ఆహార భద్రత కోసం 7,12,645 మంది, వివిధ రకాల పింఛన్ల కోసం 3,19,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. పింఛన్ దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి ఈ శుక్రవారమే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అర్హులైన వారి జాబితాలను ప్రదర్శించాలి. కానీ.. అలా వీలుపడే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని 3,19,957 పింఛన్ దరఖాస్తులకు గాను గురువారం సాయంత్రం 6 గంటల వరకు 1,81,581 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేశా రు.
ఒక్కరోజే సమయం ఉండడం, నాలుగు రోజు ల్లో 1.81 లక్షల దరఖాస్తులే ఆన్లైన్లో నమోదు చేయడంతో ఈ మిగిలిన ఒక్క రోజులో 1.38 లక్షల దరఖాస్తులను ఆన్లైన్ చేయడం కష్టంగానే మారిం ది. కంప్యూటర్లో దరఖాస్తుదారుల వివరాలను న మోదు చేసే సమయంలో జరిగిన పొరపాట్లను పరి శీలించేందుకు కూడా అధికారులకు సమయం లేకపోవడంతో, శనివారం పింఛన్ల పంపిణీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.
ఆన్లైన్ చేస్తేనే పింఛన్..
ఇదిలా ఉంటే.. జిల్లాలో మరో 1.38 లక్షల దరఖాస్తులు ఆన్లైన్ చేసేందుకు పెండింగ్లో ఉన్నాయి. అయితే.. వీరి వివరాలు ఆన్లైన్ చేస్తేనే పింఛన్ అందిస్తారా లేకుంటే దాంతో సంబంధం లేకున్నా పింఛన్ ఇస్తారా తెలీక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఆర్డీఏ అడిషనల్ పీడీ గజ్జారాంను వివరణ కోరగా.. శనివారం ఆసరా కా ర్యక్రమం ప్రారంభం వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రి య కొనసాగుతుందని, సమయానికి పూర్తికాకుంటే సంబంధిత తేదీ వరకు అనుమతి తీసుకుని పూర్తి చేస్తామని, ఆన్లైన్ పేర్లు నమోదు చేసిన వారికే పింఛన్లు అందుతాయని చెప్పారు.