Our plan for our village
-
మళ్లీ మన ఊరు–మన ప్రణాళిక
16 నుంచి 22 వరకు కార్యక్రమం హైదరాబాద్: సమ్మిళిత సంక్షేమం లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ‘మన ఊరు– మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని 16 నుంచి 22 వరకు చేపడుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సమక్షంలో ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, ఇతర అధికారులు మంగళవారం సచివాలయంలో ఈ అంశంపై సమావేశమయ్యారు. రాష్ట్రంలో 545 గ్రామీణ మండలాల్లో, 8,684 గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామాల వారీగా సంక్షేమ ప్రణాళికలను తయారు చేయ టంతోపాటు, ప్రజల సంక్షేమావసరాల గుర్తిం పును ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు. సంక్షేమ, ఆర్థిక ప్రయోజన పథకాలకు లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలని నిర్ణయించారు. మంత్రు లు, ప్రజాప్రతినిధులతోపాటు అధికారులంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. ప్రతి గ్రామం లో సభల నిర్వహణకు వీలుగా ప్రతి మండలం లో మూడు బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బృందం ఒక్కోరోజు ఒక గ్రామాన్ని సందర్శించేలా షెడ్యూలు రూపొందిస్తారు. -
‘ప్రణాళిక’ కొలిక్కి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. వాస్తవానికి ఈ నెల మొదటివారంలోనే ప్రణాళిక తుదిరూపు దాల్చాల్సి ఉండగా.. మండల పరిషత్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో గందరగోళం నెలకొంది. ప్రతి పల్లెకు మూడు పనులు చొప్పున ప్రాధాన్యత క్రమంలో తీసుకుని ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయగా.. అధికారులు మాత్రం ఒకే కేటగిరీ పనిని పలుచోట్ల తీసుకోవడంతో ప్రణాళిక ఆసాంతం తప్పులతడకగా మారింది. దీంతో మళ్లీ ప్రాధాన్యత క్రమంలో జాబితాను రూపొందించే పనిలో పడ్డ అధికారులు తాజాగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. రూ.1768.53 కోట్లతో 3,879 పనులు గుర్తించారు. శాఖల వారీగా పనులు నిర్దేశించిన యంత్రాంగం.. ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించింది. రోడ్లకే ప్రాధాన్యం.. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా యంత్రాంగం రూపొందించిన ప్లాన్లో తొలిప్రాధాన్యం రహదారులకే దక్కింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 1,370 రోడ్ల పనులు గుర్తించారు. వీటి అంచనా వ్యయం రూ.730.66కోట్లు. జిల్లా వ్యాప్తంగా రూపొందించిన ప్రణాళికలో దాదాపు 40శాతం రోడ్లకే కేటాయించారు. ఆ తర్వాత తాగునీటి విభాగంలో 1010 పనులు నిర్ధారించగా.. ఈ పనుల వ్యయం రూ. 407.54కోట్లు. అదేవిధంగా శ్మశానవాటికలకు సంబంధించి 110 పనులకు రూ. 29.21కోట్లు, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులకు సంబంధించి రూ.13.36కోట్లు పేర్కొంటూ ప్రణాళిక తయారు చేశారు. ఇందులో మొత్తం 27 శాఖలకు సంబంధించి 3,879 పనులు ప్రణాళికలో పొందుపర్చారు. ప్రభుత్వం ఆమోదం పొందిన అనంతరం నిధుల లభ్యతను బట్టి పనులు చేపట్టే అవకాశంది.