బ్యారన్ రిజిస్ట్రేషన్లకు రైతుల నిరాకరణ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం పరిధిలోని పలు గ్రామాల రైతులు తమ బ్యారన్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటిం చారు. పొగాకు బోర్డు అధికారులు జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లోని బ్యారన్లను రీ ఆర్గనైజేషన్ చేశా రు. దీంతో జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం పరిధిలో ఉన్న సీతంపేట, తిరుమలాపురం, నరసన్నపాలెం గ్రామాల రైతులకు చెందిన బ్యారన్లను కొయ్యలగూడెం వేలం కేంద్రంలో కలపడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 మంది రైతులు పొగాకు బోర్డు చైర్మన్‌కు, రీజనల్ అధికారికి, వేలం కేంద్రం అధికారికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లోని బ్యారన్లను రీ ఆర్గనైజేషన్ చేసే సమయంలో తమతో చర్చింలేదని రైతులు అంటున్నారు. తమ అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తమను జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం పరిధిలోనే ఉంచాలని లేనిపక్షంలో తమ బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించబోమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా దేవరపల్లి వేలం కేంద్రంలో బ్యారన్లు విభజించాక 2,564 ఉండగా, విభజనకు ముందు 2,276, జంగారెడ్డిగూడెం 1వ కేంద్రంలో విభజనకు తర్వాత 2,969, ముందు 3,154, 2వ కేంద్రంలో విభజన తర్వాత 2,954, ముందు 3,174, కొయ్యలగూడెం కేంద్రంలో విభజన తర్వాత 2,807, ముందు 2,941, గోపాలపురం కేంద్రంలో విభజన తర్వాత 2,630, విభజనకు ముందు 2,380 బ్యారన్లు వచ్చాయి. దేవరపల్లి కేంద్రంలో 288, గోపాలపురం కేంద్రంలో 250 బ్యారన్లు పెరగ్గా, జంగారెడ్డిగూడెం 1వ కేంద్రంలో 185, 2వ కేంద్రంలో 220, కొయ్యలగూడెం కేంద్రంలో 134 తగ్గాయి.