packages Offer
-
ఆన్‌లైన్‌లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలు టెక్ నిపుణుల వెంట పడ్డాయేంటి? అన్న సందేహం రాకమానదు. కానీ, కరోనా అనంతరం మారిన పరిస్థితులు, ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో కంపెనీలు టెక్నాలజీ నిపుణులపై పెద్ద ఎత్తున ఆధారపడడం తప్పడం లేదు. అధిక వేతనం ఆఫర్ ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా టెక్నాలజీ నిపుణులను ఆటోమొబైల్ కంపెనీలు నియమించుకుంటున్నాయి. 35–40 శాతం అధిక వేతన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పెద్ద ఎత్తున డిజిటైజేషన్ నడుస్తుండడం.. వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుండడం కారణంగా.. ఆన్లైన్ విక్రయాలను పెంచుకునే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో సరఫరా వ్యవస్థలో సమస్యలను అధిగమించేందుకు.. కొనుగోళ్లు, తయారీ కార్యక్రమాల పర్యవేక్షణకు టెక్నాలజీయే కీలకమని అవి గుర్తించాయి. వీరికి డిమాండ్ టీమ్‌లీజ్ సంస్థ వద్దనున్న సమాచారాన్ని పరిశీలిస్తే.. ఆటోమొబైల్ పరిశ్రమలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ నిపుణల నియమాకాలు కరోనా ముందు 2019తో పోలిస్తే 45 శాతం పెరగడం గమనార్హం. ‘‘గత రెండేళ్ల నుంచి వినియోగదారులు ఆన్లైన్ వేదికలపై వాహనాల గురించి తెలుసుకొని, కొనుగోలు చేయడం పెరిగింది. దీంతో ఆటోమోటివ్ కంపెనీలు కార్యకలాపాలను డిజిటైజ్ చేసి, వర్చువల్ విక్రయాలకు (ఆన్లైన్) వీలు కల్పించేందుకు, సౌకర్యం, సమర్థత పెంచేందుకు ఎక్కువ సమయం కృషి చేస్తున్నాయి’’ అని టీమ్‌లీజ్ డిజిటల్ ఏవీపీ (డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్) మునీరా లోలివాలా చెప్పారు. వాహన తయారీదారులు తమ డీలర్ నెట్‌వర్క్‌ను కూడా డిజిటల్‌గా మార్చేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడం, డీలర్ల స్థాయిలో వనరులను మెరుగ్గా వినియోగించుకోవడంతోపాటు.. మొత్తం కొనుగోలు ప్రక్రియను మార్చే దిశగా కంపెనీలు అడుగులు వేస్తుండడాన్ని గమనించాలి. ఇంత పెద్ద స్థాయిలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం నిపుణుల అవసరాలను గణనీయంగా పెంచినట్టు లోలివాలా చెప్పారు. డిజిటల్ మార్కెటింగ్, వినియోగదారుల సేవలు, వాహన ముందస్తు నిర్వహణ విభాగాల్లో నియామకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం అధికంగా ఉండొచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. మూడు నెలల్లోనే 18 వేల మంది.. ప్రస్తుత త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) 18,000 టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడినట్టు లోలివాలా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య 25,000ను చేరుకోవచ్చని ఆమె చెప్పారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ డిమాండ్ 15–18 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. విక్రయాలు, మార్కెటింగ్ విభాగాల్లో డేటా అనలిటిక్స్ నిపుణుల నియామకాలను పెంచినట్టు కార్ల తయారీ సంస్థలు సైతం అంగీకరిస్తున్నాయి. వినియోగదారులు డిజిటల్ చానళ్లవైపు మళ్లడంతో విచారణ నిర్వహణకు హైపర్ లోకల్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘ప్రస్తుతం 35 శాతం విచారణలు (కొనుగోళ్లకు సంబంధించి వివరాలు) డిజిటల్ చానళ్ల నుంచే వస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 శాతం పెరిగింది. లాక్డౌన్ల సమయాల్లో అయితే ఇది 50 శాతం వరకు ఉంది’’ అని శ్రీవాస్తవ వివరించారు. విక్రయాలకు సంబంధించి 26 టచ్పాయింట్లకు గాను 24ను డిజిటల్‌గా మార్చినట్టు.. మిగిలినవి కేవలం పరీక్షల కోసం ఉద్దేశించినవిగా చెప్పారు. ‘‘డిజిటల్ టూల్స్‌తో మా ప్లాట్‌ఫామ్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో డేటాను ఉపయోగించుకుని కొనుగోలుదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించాలన్నది మా ప్రయత్నం. ఇటువంటి అధునాతన డిజిటల్ టూల్స్ వినియోగం వల్ల సీఆర్ఎం కార్యకలాపాలకు సంబంధించి నియామకాల్లో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాం’’ అని శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా సైతం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో అధిక నైపుణ్యాలున్న వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. డిమాండ్ ఇలా... - ఆటోమొబైల్ రంగంలో ఈ త్రైమాసికంలోనే 18,000 నిపుణులకు డిమాండ్ నెలకొంది. - ఈ ఆర్థిక సంవత్సరంలో 25,000 నియామకాలకు డిమాండ్ పెరగొచ్చన్న అంచనా. - 2022–23లో ఇటువంటి నిపుణులకు 15–18% అదనపు డిమాండ్ ఉండొచ్చు. - ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీల్లో చేయి తిరిగి నిపుణులకు డిమాండ్ 45 శాతం పెరిగింది. - 35–40 శాతం అధిక వేతనాలతో కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. చదవండి: ఉద్యోగుల కోసం పోటీ పడుతున్న కంపెనీలు -
ప్యాకేజీపై మార్కెట్ దృష్టి
దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈవారంలో జరిగే పరిణామాలు కీలకం. లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నందున ఈ విషమ పరిస్థితుల్లో భారీ ఆర్థిక ప్యాకేజీని మోదీ సర్కార్ ప్రకటిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం (మే1) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ఏప్రిల్ సిరీస్ ముగింపు ఈవారంలోనే.. గురువారం (30న) ఏప్రిల్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. బుధవారం సమావేశంకానున్న అమెరికా ఫెడ్.. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది. మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెక్సావేర్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అంబుజా సిమెంట్స్, అదానీ పవర్ ఫలితాలను ఈవారంలోనే ప్రకటించనున్నాయి. -
కోట్ల నోట్లతో.. బేరసారాలు
ఓటమి భయంతో టీడీపీ బరితెగింపు ద్వితీయశ్రేణి నేతల కొనుగోలుకు యత్నం పలుచోట్ల ప్యాకేజీల ఆఫర్‌తో ఊరింపు అయినా పాచిక పారక.. నిరాశానిస్పృహలు తెలుగుదేశం విలువలకు నిస్సిగ్గుగా వెల కడుతోంది. విచ్చలవిడిగా కోట్లను కుమ్మరిస్తూ జిల్లాలో ఎన్నికల పోరును తనకనుకూలంగా మలచుకోవాలని ఆరాటపడుతోంది. ‘ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు.. మీరు బయటకు రాకపోయినా ఫర్వాలేదు.. మీ రేటెంత?’ అంటూ వివిధ నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలతో బేరసారాలు సాగిస్తూ.. బరి తెగిస్తోంది. ‘డబ్బుంటే కొండ మీది కోతినైనా కిందికి దింపవచ్చు’ అన్న సామెత చందంగా.. కోట్లు కుమ్మరిస్తే చాలు.. గెలుపు వచ్చేస్తుందన్న ఆ పార్టీ నమ్మకం వమ్ము అవుతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాలు, ముమ్మిడివరం, మండపేట, రామచంద్రపురం, కొత్తపేట, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు కోట్ల రూపాయలను కుమ్మరించేస్తున్నారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ వర్గాలు మొదటి నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్‌పై మంచి ఆదరణ చూపిస్తున్నాయి. బలమైన కాపు సామాజికవర్గానికి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్ని కేటాయించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే జగన్ కూడా కాపులకు ప్రాధాన్యం ఇవ్వడంతో కోనసీమలోని ఆ సామాజికవర్గం నుంచి వైఎస్సార్ సీపీకి వలసలు ముమ్మరమయ్యాయి. బలమైన సామాజికవర్గాలన్నీ మొగ్గు చూపడంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ బలీయమైన శక్తిగా మారింది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుంటున్న టీడీపీ.. వైఎస్సార్ సీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అన్ని రకాల ప్రలోభాలకూ తెగబడుతోంది. రాజమండ్రిలో పంపిణీకి దిగిన ‘పచ్చ’దండు రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికలప్పుడు ప్రత్యేకంగా రప్పించుకున్న ‘పచ్చదండు’తో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ కోట్లు కుమ్మరించినా జనాభిమానం ముందు ఓటమి తప్పలేదు. గత అనుభవం స్పష్టంగా కనిపిస్తున్నా ఈ ఎన్నికల్లో కూడా అదే పంథాలో వెళ్లేందుకు ఆ పార్టీ వెంపర్లాడుతోంది. హైదరాబాద్ నుంచి రప్పించిన ‘పచ్చదండు’లో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు పాతిక మందిని వినియోగిస్తూ, వారితోనే పంపకాలకు శ్రీకారం చుట్టారని తెలియవచ్చింది. ఇక అమలాపురం ఎంపీ అభ్యర్థి పండుల రవీంద్రబాబు కనీసం ఆ పార్టీ శ్రేణులకే తెలియని వింత పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన మాటల కంటే నోట్లనే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. అన్నీ తానై చూసుకుంటున్న ఒక కార్పొరేట్ దిగ్గజం అండతో ప్రతి సెగ్మెంట్‌కూ ఏడెనిమిది కోట్లుపైనే కుమ్మరిస్తున్నారని తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు లక్ష్యంగా నేతల కొనుగోలుకు బరితెగిస్తోంది. కోనసీమలో ఒక బలమైన నాయకుడు బరి నుంచి తప్పుకొనేందుకు భారీ ప్యాకేజీ ఇవ్వజూపినట్టు తెలుస్తోంది. ఇదే పంథాను ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో టీడీపీ అనుసరిస్తోంది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ మారిన రాజకీయ సమీకరణలతో వైఎస్సార్ సీపీ బలమైన శక్తిగా మారింది. ఇదే విషయాన్ని జాతీయస్థాయి సర్వే నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులే లక్ష్యంగా టీడీపీ ప్రలోభాలకు తెరతీసింది. గత మూడు రోజులుగా టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ద్వితీయశ్రేణి నాయకులను ప్రలోభ పెట్టాలని ప్రయత్నించి, బోర్లాపడింది. విధం చెడ్డా.. దక్కని ఫలితం ముమ్మిడివరం నియోజకవర్గంలో వివిధ వర్గాల ఆదరణ, మారిన రాజకీయ సమీకరణలతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుత్తుల సాయి ముందంజలో ఉన్నారు. ఈ పరిణామంతో బెంబేలెత్తిపోతున్న టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు విచ్చలవిడిగా డబ్బు కుమ్మరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఒక వర్గానికి చెందిన 70 మంది ప్రతినిధులకు భారీ ప్యాకేజీ ఆఫర్ చేశారని నియోజకవర్గం కోడై కూస్తోంది. ఆ ఆఫర్‌ను ఆ వర్గాల ప్రతినిధులు నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో కంగుతిన్న టీడీపీ ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. మండపేటలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ ముందు.. టీడీపీ కుప్పిగంతులు సాగడం లేదు. రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పోకడను అనుసరించబోయిన టీడీపీ నేతలకు తలబొప్పి కట్టిందంటున్నారు. నిన్నమొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్‌ను వీడి పలువురు నేతలు.. టీడీపీ పంచన చేరడంతో ఎదురవుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు ఇక్కడ కూడా ప్యాకేజీల జాతరకు తెరతీసింది. సామాజికవర్గాల నేతలకు ఎర వేసే ప్రయత్నాలు ఈ రెండుచోట్లా తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకునేలా చేస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు ఇస్తామని ఊరిస్తున్నా వారి మాటలను ఎవరూ విశ్వసించకపోవడంతో.. టీడీపీ పని విధం చెడ్డా ఫలం దక్కని బాపతుగా మిగులుతోంది.