చిన్నశేషునిపై లోకమాత
తిరుచానూరు: పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజైన బుధవారం రాత్రి యోగముద్రలోని బద్రీనారాయణుడి అలంకరణలో అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామునే నిద్రమేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 9.16 నుంచి 9.30 గంటల్లోపు ధనుర్లగ్నంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు గజచిత్రపటాన్ని ధ్వజారోహణం చేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
సాయంత్రం ఆస్థానమండపంలో అమ్మవారికి కన్నులపండువగా ఊంజల్‌సేవ జరిగింది. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి చిన్నశేషునిపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్య ఆభరణాలతో అమ్మవారిని యోగముద్రలో ఉన్న బద్రీనారాయణుడిగా అలంకరించారు. రాత్రి 8 గంటలకు గజ, తురగ, వృషభాలు వెంటరాగా, మంగళ వాయిద్యాలు, భజన బృందాలు, భక్తుల కోలాటాలు, జియ్యర్ స్వాముల ప్రబంధనం, వేదపండితుల వేదపారాయణం నడుమ అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు.