కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా సిక్కు మహిళ
- అరుదైన గౌరవాన్ని పొందిన పర్బీందర్ కౌర్ షెర్గీల్
ఒట్టావా: భారత సంతతికి చెందిన సిక్కు మహిళ పర్బీందర్ కౌర్ షెర్గీల్ కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తలపాగా ధరించే ఓ మహిళకు ఆ దేశంలో ఇంతటి కీలక పదవి దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. కెనడా ఫెడరల్ కేబినెట్ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రటిష్కొలంబియా సుప్రీం కోర్టు జడ్జిగా జస్టిన్ పర్బీందర్ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
పంజాబ్లో జన్మించిన పర్బీందర్.. నాలుగేళ్ల వయసులోనే కుటుంబంతోకలిసి కెనడా వెళ్లారు. అక్కడి సస్కట్చెవాన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. అనంతరం స్థానిక సిక్కుల హక్కుల కోసం ఎనలేని కృషిచేశారు. విద్యాలయాలకు వెళ్లే సిక్కు విద్యార్థులు తమ సంప్రదాయ ఆయుధమైన కిర్పాన్(ఖడ్గం)ను ధరించే హక్కు కోసం ఆమె సాగించిన న్యాయపోరాటం, సాధించిన విజయం అప్పట్లో విశేష ప్రాచుర్యం పొందింది.
పర్బీందర్కు భర్త, ఒక కూతురు, మగ కవలలు ఉన్నారు. కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా కౌర్ నియామకం పట్ల ప్రపంచ సిక్కు సంఘం(డబ్ల్యూఎస్వో) హర్షం వ్యక్తం చేసింది. కెనడాలోని భారత సంతతికి చెందిన ప్రముఖులు సైతం ఆమెకు అభినందనలు తెలిపారు.