44 ఫోర్లు.. 23 సిక్సర్లు..413!
కోల్ కతా: క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ డివిజన్ టోర్నమెంట్లో బారిషా క్లబ్ ఆటగాడు పంకజ్ షా విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. దక్షిణ్ కాలికటా సంసాద్ తో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన పంకజ్ క్వాడ్రాపుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఆదివారం 44 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన 28 ఏళ్ల పంకజ్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 44 ఫోర్లు, 23 సిక్సర్లతో 413 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ నాలుగు వందలకు పైగా వ్యక్తిగత పరుగులను సాధించాడు.
ఈ క్రమంలోనే ఆరో వికెట్ కు 203 పరుగుల భాగస్వామ్యాన్ని, ఎనిమిదో వికెట్ కు 191 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. దాంతో 192/2 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన బారిషా క్లబ్ జట్టు 708/8 వద్ద డిక్లేర్ చేసింది. గత సీజన్లో రాజస్తాన్ తో మ్యాచ్ సందర్బంగా రంజీల్లో అరంగేట్రం చేసిన షా.. బెంగాల్ తరపున ఇప్పటివరకూ 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడగా, నాలుగు లిస్ట్-ఎ మ్యాచ్లను, 12 ట్వంటీ 20 మ్యాచ్లను ఆడాడు.