మట్టిపూల పరిశ్రమ వాడని పూలతోరణం!
మీరే పారిశ్రామికవేత్త
ప్రకృతి స్ఫూర్తితో నింగికెగిరి, నీటిలో ప్రయాణించిన మనిషి, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కదానినీ తాను కూడా చేసి చూసి మురిసిపోవాలనుకుంటాడు. చిత్రకళ, శిల్పకళ అలా రూపుదిద్దుకున్నవే. తాజాగా మార్కెట్ పరిభ్రమణం క్లే ఆర్టికల్స్ మీదకు మళ్లింది. క్లే ఆర్టికల్స్ తయారీ పరిశ్రమను స్థాపించాలంటే...
ఈ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా కొనాల్సిన వస్తువులు పెద్దగా ఉండవు. ఇంట్లోనే ఒక గది దీని కోసం కేటాయించుకోవచ్చు. టేబుల్, కుర్చీల వంటివి ఇంట్లో ఉన్నవే వాడుకోవచ్చు.
ప్రత్యేకించి పరిశ్రమ కోసం కొనాల్సినవి...
ఆర్ట్ క్లే, ఫుడ్ కలర్స్, డిస్పోజబుల్ గ్లాసులు (ఫ్లవర్‌పాట్ తయారీకి), అప్పడాల కర్ర (ఆర్ట్ క్లేని మృదువుగా చేసుకోవడానికి), ప్లాస్టిక్ టూత్ పిక్స్ (పూలకు కాడలుగా, ఫ్రేమ్‌లో చక్కగా గుచ్చుకోవడానికి), పెన్, స్కెచ్ పెన్, ఐవరీ కార్డు (గ్రీటింగ్ కార్డు తయారీ కోసం), గ్లాస్ పలకలు (ఆక్రిలిక్ పలకలు కూడా వాడవచ్చు), ఫెవికాల్, అల్యూమినియం ఫాయిల్ వంటివి సరిపోతాయి.
ఒక మహిళ నెల రోజుల పాటు ఇంట్లో ఈ పూలు, బొమ్మలు తయారు చేసుకోవడానికి ఇరవై కిలోల ఆర్ట్ క్లే తీసుకుంటే సరిపోతుంది. ఈ కుటీర పరిశ్రమ స్థాపించడానికి ఖర్చు పాతిక వేల రూపాయలకు మించదు. ఇంట్లో ఉత్పత్తి చేసుకుని, ఆ వస్తువులను బయట మార్కెట్ చేసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని చెప్పిన వివరాలివి. ఒక మోస్తరు షో రూమ్ పెట్టాలంటే దానికోసం అద్దె, సహాయకుల జీతాల వంటివి అదనంగా ఉంటాయి.
ఏమేం చేయవచ్చు?
ఆర్ట్ క్లేతో ఇరవై రకాల పూలు చేయవచ్చు. చిట్టిపూలతో దండలు, బ్రేస్లెట్లు, తోరణాలు, పెద్ద పూలతో వాల్ హ్యాంగింగ్స్, సీనరీలు, గ్రీటింగ్ కార్డులు, ఫ్ల్లవర్ వాజులు, ఫ్లవర్ బొకేలు, పెన్‌స్టాండులు చేయవచ్చు. బీడ్స్ వరుసలతో ముందు గదికి, డైనింగ్ హాల్‌కి మధ్యలో పార్టిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. దేవుడి విగ్రహాలకు, పెద్దవాళ్ల ఫొటోలకు హారాలు చేయవచ్చు. శిల్పాలు కూడా చక్కగా రూపుదిద్దుకుంటాయి.
మార్కెట్ స్థితిగతులు...
పెన్ స్టాండులు, చిన్న పూల తోరణాలకు మంచి గిరాకీ ఉంటోంది. పువ్వు రెండు రూపాయల చొప్పున ఎంత పొడవు కావాలంటే అంత తోరణం కట్టించుకోవచ్చు. గ్రీటింగ్ కార్డు 50 రూపాయలకే దొరుకుతుంది. ఆర్ట్ క్లే పూలతో చేసిన చిన్న వాల్ హ్యాంగింగ్ రూ 350 నుంచి మొదలవుతుంది. పెద్దవి ఉడెన్ ఫ్రేమ్ కట్టిన వాల్ హ్యాంగింగ్ ధర ఐదువేల వరకు ఉంటుంది.
శిక్షణ, రిజిస్ట్రేషన్ వివరాలకు... 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు.
‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో...
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి
స్వయం సమృద్ధి సాధించాలనే ఆసక్తి ఉంటే చాలు...
ప్రభుత్వం... ఎం.ఎస్.ఎం.ఇ. (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్), ఎన్.ఎస్.ఐ.సి. (నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్), ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. ఎలీప్ వంటి సంస్థల సమన్వయంతో శిక్షణ, పరిశ్రమ స్థాపన, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. జిల్లాల్లో సదస్సులు పెట్టి శిక్షణనిస్తున్నాం. శిక్షణ పూర్తయిన బృందానికి, కొత్తగా శిక్షణ తీసుకున్న బృందానికి మధ్య సంధానకర్తగా ఉంటూ ఒకరి అనుభవాలను మరొకరు అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తున్నాం. శిక్షణలో నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగం లేదా పరిశ్రమ స్థాపన పట్ల ధైర్యం వస్తుంది. ఒకరుగా చేయలేని పరిశ్రమలైతే ఐదారు మంది బృందాలుగా ఏర్పడి (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పరిశ్రమ స్థాపించవచ్చు. కుటుంబ కారణాల వల్ల ఇవేవీ చేయడం సాధ్యం కాని మహిళలు పరిశ్రమల వారికి అవుట్ సోర్సింగ్ ద్వారా పని చేసి తగిన వేతనం (పీస్ లెక్కన) తీసుకోవచ్చు.
- పంకజ్ శ్రీనివాసన్, మేనేజర్, ఎంప్లాయ్మెంట్ కో ఆర్డినేటర్
ఫోన్: 8886665904
pankaj.textmin@gmail.com