Paper prices
-
‘ప్రింట్’పై సుంకం కొరడా!
(సాక్షి, బిజినెస్ ప్రతినిధి): ఒకవైపు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్న డాలర్–రూపాయి విలువతో ఆందోళన చెందుతున్న ప్రింట్ మీడియాపై... శుక్రవారం నాటి బడ్జెట్ మరో బండను పడేసింది. దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్‌పై 10 శాతం సుంకం విధించడం ఈ రంగంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపించనుంది. ఎందుకంటే ఒకవైపు డిజిటల్ మీడియా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో ప్రింట్ మీడియాకు ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా విదేశాల్లో సైతం న్యూస్‌ప్రింట్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతేడాది ఒకదశలో టన్ను న్యూస్‌ప్రింట్ ధర 820 డాలర్లకు కూడా చేరింది. ఆ దెబ్బకు కొన్ని చిన్న పత్రికలు మూతపడ్డాయి కూడా. అక్టోబర్ తరువాత కొంత దిగిరావటం మొదలై.... రెండు నెలల కిందట ధరలు కాస్త స్థిరపడి.. ప్రస్తుతం టన్ను న్యూస్‌ప్రింట్ ధర 700 డాలర్లకు అటూఇటుగా ఉంది. నిజానికి చాలా వరకూ పత్రికలు తక్షణ ఇబ్బందులు రాకుండా ఐదారు నెలలకు సరిపడా నిల్వల్ని ముందే తెచ్చుకుని పెట్టుకుంటాయి. కాబట్టి తగ్గిన ధరల తాలూకు ఫలితం వాటికింకా అందలేదనే చెప్పాలి. పోనీ ఇప్పుడైనా ఉపశమనం దొరుకుతుందని భావించిన ప్రింట్ మీడియాపై శుక్రవారం నాటి బడ్జెట్ ఏకంగా బాంబునే వేసింది. ఇప్పటిదాకా వీటిపై దిగుమతి సుంకం లేకపోగా... ఒకేసారి 10 శాతం విధించటం గమనార్హం. ఈ చర్యతో మరిన్ని చిన్న, భాషా పత్రికలు మూతపడవచ్చనే ఆందోళన నెలకొంది. ‘‘ప్రకటనల ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఆశించిన సాయం అందించకపోగా ప్రభుత్వం ఇలా సుంకాలు మోపి దెబ్బతీయడం దురదృష్టకరం’’అని భారతీయ భాషా పత్రికల సంఘం (ఐఎల్ఎన్ఏ) అధ్యక్షుడు పరేష్‌నాథ్ తప్పుబట్టారు. ఆంగ్ల పత్రికలకు ప్రయివేట్ ప్రకటనలు, టెండర్ నోటిఫికేషన్ల రూపంలో ఆదాయం బాగానే వస్తుందని, దేశవ్యాప్తంగా విస్తరించిన చిన్న, మధ్య స్థాయి భాషా పత్రికలు ఈ భారాన్ని మోయలేవని ఆయన చెప్పారు. తక్కువ నాణ్యతతో, ఎక్కువ లాభాలు ఆర్జించాలని దేశీ న్యూస్‌ప్రింట్ తయారీదారులు ఆలోచిస్తున్నారని, వారి ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం దిగుమతి సుంకం విధించిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఈ సుంకాన్ని తక్షణం తొలగించాలని, తన చర్యను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
పెరగనున్న పాఠ్య పుస్తకాల ధరలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల పాఠ్య పుస్తకాల ధరలు పెరగనున్నాయి. పేపర్ ధరలు పెరిగిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో పుస్తకాలపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పాఠ్య పుస్తకాలకు ఉపయోగించే పేపరు టన్నుకు రూ.5 వేల వరకు అదనంగా ధర పెరిగిందని, దీంతో పుస్తకాల ధరలు 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు అందించే పుస్తకాలపై పెరిగే ధరలను ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే మరో 30 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులపై మాత్రం భారం పడనుంది. పెరిగిన ధరల మేరకు పబ్లిషర్లు ధరలను పెంచే అవకాశం ఉండటంతో ఆ మేరకు తల్లిదండ్రులపైనా భారం తప్పేలా లేదు. ఇక పుస్తకాల ముద్రణకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి ఫైలు పంపించామని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లభించగానే టెండర్లను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. -
కాగితం.. మరింత ప్రియం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాగితం ధరను మరోసారి పెంచేందుకు కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త ధరలు వర్తింపజేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. దేశీయంగా కొరత తలెత్తడంతో కలప ధర అనూహ్యంగా 60 శాతం పెరిగింది. దీనికితోడు రూపాయి పతనం కూడా ఆజ్యం పోసినట్టయింది. నాణ్యమైన పేపర్‌ను తయారు చేస్తున్న కొన్ని కంపెనీలు ఇటీవలే అన్ని రకాల అన్‌కోటెడ్ హై బ్రైట్, క్రీమ్ వోవ్ పేపర్ ధరలను టన్నుకు రూ. 3 వేల దాకా పెంచాయి. కాపియర్, పోస్టర్ పేపర్, లెడ్జర్, బీసీబీ పేపర్ ధర టన్నుకు రూ.1,500-2,000 దాకా హెచ్చించినట్టు సమాచారం. జేకే పేపర్ డిసెంబరు 1 నుంచి 3% పెంచింది. రసాయనాలు, విద్యుత్, రవాణా చార్జీలు తడిసి మోపెడు అవుతున్నాయని బల్లార్పూర్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ సిన్హా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది 10 లక్షల టన్నుల కలపను పేపర్ పరిశ్రమ దిగుమతి చేసుకోవచ్చని అంచనాగా చెప్పారు. పెంపు తప్పదు...: మరోసారి పేపర్ ధర పెంచే అవకాశం ఉందని ఐటీసీ పేపర్‌బోర్డ్స్, స్పెషాలిటీ పేపర్స్ విభాగం మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.వెంకటరామన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర పెంచక తప్పదని అన్నారు. మొత్తం కలప అవసరాల్లో 20 శాతం దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. దేశీయ కలపతో పోలిస్తే ఇది నాణ్యమైందని, అంతేగాక ధర 10 శాతం దాకా ఎక్కువని పేర్కొన్నారు. కాగా, పేపర్ మిల్లులు ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 శాతం, సెప్టెంబరులో 12 శాతం దాకా ధర పెంచాయి. ఇలా ధరలు పెరుగుతూ పోతుంటే పరిశ్రమలో మనలేమని ప్రింటింగ్, ప్యాకేజింగ్ కంపెనీల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు, ఆఫీస్ స్టేషనరీ, నోట్‌బుక్స్ ధరలు జనవరి నుంచి ప్రియం కానున్నాయి.