తల్లిదండ్రులపై ఫీజుల మోత!
మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాస్ తన పాపను నర్సరీలో చేర్పించేందుకు కొద్దిగా పేరున్న స్కూలుకు వెళ్లాడు. కానీ అక్కడ వారు చెప్పిన లెక్క విని కంగుతిన్నాడు. ఫీజు కింద రూ.28 వేలు, డొనేషన్ పేరిట సుమారు రూ. 40 వేలు, యూనిఫాం, టై, బెల్ట్, బూట్లకు రూ. 5 వేలు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్కు రూ. 3 వేలు, రవాణాకు రూ. 12 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో అవాక్కయ్యాడు.
ఈ ఒక్క స్కూల్లోనే కాదు... రాష్ట్రంలో పేరొందిన ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలోనూ ఫీజుల వ్యాపారం ఇదే స్థాయిలో సాగుతోంది.
25 శాతం పెంచేసిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు
♦ ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టని సర్కారు
♦ కోర్టు తీర్పు పేరిట పక్కకు పెట్టిన విద్యాశాఖ
♦ అమలుకు నోచుకోని 25 శాతం ఉచిత సీట్లు
♦ నేటి నుంచే బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేటి నుంచి బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులను ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందా హడలెత్తించనుంది! ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో ఈసారి సాధారణ ప్రైవేటు పాఠశాలలు 25 శాతం మేర ఫీజులను పెంచి వసూలు చేయనున్నాయి. మరోవైపు కొత్త రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించినా అవి అమల్లోకి రాలేదు. ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 31 లక్షల వుంది విద్యార్థులు చదువు తుండగా ఆయూ స్కూళ్లలో ఫీజుల నియుంత్రణకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టలేకపోతోంది.
గతంలో ఫీజుల నియుంత్రణకు ఉత్తర్వులు జారీ చేసినా వాటిని పక్కాగా అమలు చేయడంలో విఫలమైంది. దీనికితోడు ఫీజుల నియుంత్రణకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నిబంధనల ప్రకారం లేవంటూ హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సవాల్ చేయకపోవడంతో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులపై నియుంత్రణ కొరవడింది.
25 శాతం సీట్లలో ఉచిత ప్రవేశాలు ఈసారైనా అమలయ్యేనా?
విద్యా హక్కు చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లలో ఉచిత ప్రవేశాలు (ప్రభుత్వ రీయింబర్స్మెంట్ ద్వారా) అమలు చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా వూరింది. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వమే రీయిం బర్స్మెంట్ చేస్తూ ప్రైవేటు స్కూళ్లలోని ప్రారంభ తరగతిలో 25 శాతం సీట్లలో ప్రవేశాలు కల్పించి ఉచిత విద్యను అందించ డంలో ముందున్నాయి. చట్టం అమల్లోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఈ నిబంధనను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. 2015- 16 విద్యా సంవత్సరంలో ఉచిత ప్రవేశాల అమలుకు విద్యాశాఖ సర్క్యులర్ (ఆర్సీ నం బరు 45/పీఎస్-3/2015) జారీ చేసి చేతులు దులుపుకుందే తప్ప పక్కా చర్యలు చేపట్టలేకపోయింది.