‘పాషణ్’ ఇక పరిశుభ్రం
పుణే: నగర శివారులోని పాషణ్ సరస్సుతోపాటు పరిసర ప్రాంతాల్లో పుష్పజాతుల పరిరక్షణపై పుణే మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి సారించింది. ఇందులోభాగంగా ఈ సరస్సులో పెరిగిన గుర్రపుడెక్క, తామర మొక్కల తొలగింపు పనులను ఆదివారం చేపట్టింది. ఈ విషయాన్ని పీఎంసీ పర్యావరణ విభాగం అధికారి మంగేష్ దిఘే వెల్లడించారు. నెల రోజుల్లోగా ఈ పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
గుర్రపుడెక్కను తొలగిస్తున్నామన్నారు. ఈ పనుల్లో దాదాపు 20 మంది కార్మికులు పాలుపంచుకుంటున్నారన్నారు. ఇందుకు ఉద్యానవనం, ఆరోగ్య విభాగం, ఘన వ్యర్థాల నిర్వహణ విభాగం, జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ నిర్మాణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) అధికారులు కూడా తమవంతు సహకారం అందిస్తున్నారన్నారు. ఈ సర స్సులోకి కాలుష్యాలు వచ్చిచేరకుండా చేసేందుకుగాను దీని పరిసర ప్రాంతాల్లో త్వరలో జనజాగృతి కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. ఈ పనులు పూర్తయితే ఈ సరస్సు పరిశుభ్రంగా మారుతుందన్నారు. ఇందువల్ల పుష్పజాతుల పరిరక్షణ జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈ సరస్సు అత్యంత సుందరంగా మారుతుందన్నారు. తత ్ఫలితంగా దీని పరిసర ప్రాంతాలకు ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నారు. కాగా ఈ సర స్సుకు వందల సంఖ్యలో దేశీయ పక్షులతోపాటు వలస పక్షులు కూడా వస్తుంటాయన్నారు.
200 నుంచి దాదాపు ఐదువేల వరకూ విదేశీ పక్షులు ఇక్కడికి వచ్చి వాలుతుంటాయన్నారు. అయితే ప్రస్తుతం కేవలం స్వల్పసంఖ్యలోనే వస్తున్నాయన్నారు. మరోవైపు పక్షుల రాక తగ్గుముఖం పట్టడానికి మానవ జోక్యం పెరిగిపోవడమేనని పక్షి ప్రేమికులు, నిపుణులు చెబుతున్నారు. గత కొద్దిసంవత్సరాలుగా ఇక్కడ మానవ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందంటున్నారు. ఈ సరస్సులో తామర, గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిందని, ఇది కాలుష్యానికి సంకేతమని వారంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘనవ్యర్థాల నిర్వహణ విభాగం ఈ సరస్సు పరిసరాలను శుభ్రం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులోభాగంగానే ఈ పనులు మొదలయ్యాయి. ఇందులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా తొలగించనున్నారు. ఈ విషయాన్ని పీఎంసీ ఘనవ్యర్థాల నిర్వహణ విభాగం ప్రధాన అధికారి సురేశ్ జగతాప్ వెల్లడించారు.