దన్నుగా నిలుస్తా
ఆయన జిల్లాలోనే పేరుగాంచిన సీనియర్ నేత. 40 ఏళ్లుగా ప్రజలతో మమేకమవుతూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం నారాయణఖేడ్ శాసన సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయనే పట్లోళ్ల కిష్టారెడ్డి. ఆదివారం వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, గురుకుల పాఠశాల విద్యార్థుల బాగోగులు తెలుసుకునేందుకు తొలిసారి జర్నలిస్టు అవతారం ఎత్తారు. ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారి నారాయణఖేడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్లోని విద్యార్థులుంటున్న గదులతో పాటు వంటగది, వరండా, మూత్రశాలలు, మరుగుదొడ్లును పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. గురుకులం భవనం 20 ఏళ్ల క్రితం నిర్మించింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. నూతన భవనం నిర్మించేందుకు రూ.13 కోట్లు మంజూరు అయ్యేలా కృషి చేశాను. నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివారులోని 8 ఎకరాల్లో గురుకుల భవనం నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటున్నాం. అది పూర్తయితే భవనం సమస్య తీరుతుంది. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకుంటాను. మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానపుగదుల నిర్వహణపై ప్రిన్సిపాల్‌కు పలు సూచనలు చేశాను. విద్యార్థులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలకు వెనుకాడబోం.
- పట్లోళ్ల కిష్టారెడ్డి, శాసనసభ్యులు, నారాయణఖేడ్.
పి.కిష్టారెడ్డి: ఏం పిల్లలూ బాగున్నారా?
విద్యార్థులు : బాగున్నాం.. సార్.
పి.కిష్టారెడ్డి: బాబూ నీపేరేంది? ఏ తరగతి చదువుతున్నావు?
సందీప్(టెన్త్): నా పేరు సందీప్ సార్, నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను.
పి.కిష్టారెడ్డి: టెన్త్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. పాసవుతావా?
సందీప్: పాసవుతాను సార్. కానీ కొద్దిగా కష్టంగా ఉంది. ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పడం లేదు. స్టడీ అవర్స్ నిర్వహించడం లేదు.
పి.కిష్టారెడ్డి: మీకు యూనిఫాంలు అందాయా? వసతి గదులు ఎలా ఉన్నాయి.. ఒక గదిలో ఎంత మంది ఉంటున్నారు?
రజనీకాంత్(టెన్త్): పాఠశాల ప్రారంభమై 8 నెల లు గడిచినా ఇంత వరకు బట్టలు అందలేదు. మేము ఉండే గదులు బాగా లేవు. మేము ఉండేం దుకునానా ఇబ్బందులు పడుతున్నాం. వాన పడితే నీళ్లు లోపలికి వస్తున్నాయి. ఒక గదిలో 16 నుంచి 20 మందిమి ఉంటున్నాం.
పి.కిష్టారెడ్డి: హాస్టల్లో ఇంకేం సమస్యలు ఉన్నాయి?
సతీష్(ఇంటర్ సెంకడ్ ఇయర్) : హాస్టల్లో బాత్రూంలు సరిగ్గా లేవు. నీళ్లు సమస్య తీవ్రంగా ఉంది. కరెంట్ పోతే బోరు మోటారు లేక బయటకు వెళ్లాల్సి వస్తోంది. తాగునీరు కూడాసరిగ్గా లేవు. బోరునీరే తాగుతున్నాం.
పి.కిష్టారెడ్డి: రోజూ మీకు భోజనంలో ఏమేమి వడ్డిస్తున్నారు?
జి.దత్తు(5వ తరగతి): ఉదయం కిచిడీ, మధ్యాహ్నం సాంబారు అన్నం, సాయంత్రం బఠానీలు, శనగలు, పెసర్లు, అరటిపండ్లు ఇస్తున్నారు. రాత్రిపూట అన్నం, కర్రీ, సాంబారు పెడుతున్నారు. నెలకు మూడు సార్లు మాంసాహారం పెడుతున్నారు. తాగడానికి మాత్రం మురికినీళ్లు వస్తున్నాయి. మంచినీరు ఇవ్వాలి.
పి.కిష్టారెడ్డి: ఇంతకు ముందు ఎక్కడ చదువుకున్నావు. అక్కడికీ, ఇక్కడికి తేడా ఉందా?
సుకుమార్( 6వ తరగతి): కల్హేర్ మండలం రాపర్తిలో చదువుకున్నాను. 6లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇంగ్లీష్‌లో బోధిస్తున్నారు. అర్థం అవుతుంది.
అనంతరం హాస్టల్లోని గదులను పరిశీలించి సమస్యలు అడిగారు.
పి.కిష్టారెడ్డి: తినడానికి ప్లేట్లు, గ్లాసులు, బట్టలు పెట్టుకునేందుకు పెట్టెలు ఉన్నాయా?
రాజ్‌కిరణ్(9వ తరగతి) : తినడానికి ప్లేటు ఉంది. గ్లాసులు మాత్రం లేవు. ప్లేట్లతోనే నీరు తాగుతున్నాం. పెట్టెలకు తాళాలు లేకపోవడంతో ఇచ్చిన గ్లాసు పోయింది.
హాస్టల్లోని క్లినిక్ తాళం తీయించి స్టాఫ్‌నర్సుతో మాట్లాడారు.
పి.కిష్టారెడ్డి: విద్యార్థులకు ఇచ్చేందుకు మందులు ఉన్నాయా. ఈ రోజు ఎంత మందికి ఏమిచ్చావు?
దేవేందర్(స్టాఫ్‌నర్స్): మందులు ఉన్నాయి సార్. విద్యార్థులకు జబ్బులు వస్తే తెలుసుకొని మందులు ఇస్తున్నాను. ఈరోజు ఇద్దరు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వారికి మందులు ఇచ్చాను.
మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశీలించి విద్యార్థులను అడిగారు.
పి.కిష్టారెడ్డి: బాత్రూంలు శుభ్రంగా ఉన్నాయా?
అనిల్‌కుమార్(టెన్త్): సరిగ్గా లేవు. నీరు రావడం లేదు. వారానికి ఓసారి శుభ్రం చేస్తారు. నీరు రాకపోవడంతో బహిర్భూమికి చీకట్లో వెళ్లాల్సి వస్తోంది. అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయి. వంట మనుషులు శుభ్రత పాటించడంలేదు. దీంతో వారు చేసిన ఆహారం తినలేకపోతున్నాం.
వంట గదిని, అన్నం, సాంబారును పరిశీలించాక..
పి.కిష్టారెడ్డి: అన్నం , సాంబారు బాగున్నాయా?
మోహన్‌దాస్(7వ తరగతి): అన్నం ఉడక లేదు. మధ్యాహ్నం వండిన సాంబారే పెడుతున్నారు. సాంబారులో కూడా నీళ్లే ఉన్నాయి. ఉప్పు, నూనె అస్సలే లేవు. తినలేకపోతున్నాం.