జంప్‌జిలానీలు వీరే..
హైకమాండ్‌కు 30 మందితో జాబితా పంపిన పీసీసీ చీఫ్ బొత్స
కర్నూలు, విశాఖ జిల్లాల్లో అత్యధికం
70 మంది వెళ్లిపోతారంటున్న లగడపాటి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. సీమాంధ్రకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే ప్రకటించారు. ఈ మేరకు మొత్తం 30 మంది ఎమ్మెల్యేలతో కూడిన వలస జాబితాను ఇప్పటికే ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలెవరు? ఏయే జిల్లాల్లో ఎంతమంది పార్టీ వీడుతారన్న విషయంపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ సాగుతోంది. వలసల జాబితాలో మొత్తం ఆరుగురు మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, అహ్మదుల్లా, గల్లా అరుణ కుమారి ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో కాంగ్రెస్‌ను వీడటం దాదాపుగా ఖాయమైందని పీసీసీ వర్గాల సమాచారం.
ఇక జిల్లాలవారీగా చూస్తే కర్నూ లు, విశాఖపట్నం జిల్లాల నుంచి అత్యధికంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు పీసీసీ నేతలు అంచనాకొచ్చారు. గంటాతోపాటు అవంతి శ్రీనివాసరావు (భీమిలి), వెంకట్రామయ్య(గాజువాక), ముత్యాలపాప (నర్సీపట్నం) విశాఖ నుంచి వెళ్లే వలస జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు తైనాల విజయకుమార్ పేరు కూడా (విశాఖ నార్త్) ప్రచారంలో ఉంది. కర్నూలు జిల్లాలో టీజీ, ఏరాసులతోపాటు శిల్పామోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి కూడా పార్టీ వీడతారని ప్రచారంలో ఉన్నప్పటికీ పీసీసీ ధ్రువీకరించలేదు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం బొత్స వ్యాఖ్యలతో విభేదించారు.
కాంగ్రెస్ నుంచి ఏకంగా 70 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నారని ఆయన విజయవాడలో చెప్పారు. వీరిలో ఎక్కువమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు వెళ్లాలని ఆసక్తి చూపుతుండగా... అక్కడ అవకాశం లేనివారికి టీడీపీ గాలం వేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జిల్లాలవారీగా ఎవరెవరు పార్టీని వీడుతున్నారనే అంశంపై పీసీసీ వర్గాలు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి...
శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), జుట్టు జగన్నాయకులు (పలాస), మీసాల నీలకంఠంనాయుడు(ఎచ్చెర్ల), సుగ్రీవులు(పాలకొండ), కొర్ల భారతి (టెక్కలి). వీరిలో ధర్మాన, సుగ్రీవులు మాత్రమే పార్టీని వీడతారని పీసీసీ ముఖ్య నాయకులు చెబుతున్నారు.
విజయనగరం: రాజన్నదొర (ఇప్పటికే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో అధికారికంగా చేరిపోయారు).
విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావు(అనకాపల్లి), అవంతి శ్రీనివాసరావు (భీమి లి), చింతలపూడి వెంకట్రామయ్య(గాజువాక), ముత్యాలపాప(నర్సీపట్నం), పి.రమేశ్‌బాబు(పెందుర్తి), యూవీ రమణమూర్తి (యలమంచిలి). వీరిలో రమేశ్‌బాబు, ముత్యాలపాప పార్టీని వీడే అవకాశం లేదని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
తూర్పుగోదావరి: తోట నరసింహం (జగ్గంపేట), తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం), పంతం గాంధీమోహన్(పెద్దాపురం), వంగా గీత(పిఠాపురం). వీరిలో తోట నరసింహం, గీత వెళ్లే అవకాశమే లేదని పీసీసీ నాయకులు చెబుతున్నారు.
పశ్చిమగోదావరి: కొత్తపల్లి సుబ్బారాయుడు (నర్సాపురం), పి.రామాంజనేయులు (భీమవరం), ఈలి నాని (తాడేపల్లి గూడెం).
కృష్ణా: జిల్లా నుంచి ఎవరూ వెళ్లే అవకాశమే లేదని పీసీసీ చెబుతుండగా.... వెల్లంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి పార్టీని వీడే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.
గుంటూరు: కాసు కృష్ణారెడ్డి (నర్సారావుపేట), యర్రం వెంకటేశ్వరరెడ్డి (సత్తెనపల్లి), గాదె వెంకటరెడ్డి (బాపట్ల). వీరిలో ఇద్దరు మాత్రమే పార్టీని వీడతారని పీసీసీ వర్గాల సమాచారం.
ప్రకాశం: అన్నె రాంబాబు (గిద్దలూరు), ఆదిమూలం సురేష్ (యర్రగొండపాలెం).
నెల్లూరు: శ్రీధర కృష్ణారెడ్డి(నెల్లూరు సిటీ), ఆదాల ప్రభాకర్‌రెడ్డి (సర్వేపల్లి).
చిత్తూరు: షాజహాన్ బాషా (మదనపల్లె), గల్లా అరుణకుమారి (చంద్రగిరి). వీరిలో గల్లా అరుణ కుమారుడు గల్లా జయదేవ్‌కు టీడీపీ లోక్‌సభ టిక్కెట్ దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.
కడప: ఆదినారాయణరెడ్డి(జమ్మలమడుగు) ఇప్పటికే వైఎస్సార్ సీపీ లో చేరగా, వీరశివారెడ్డి(కమలాపురం) వలస జాబితాలో ఉన్నారు.
కర్నూలు: టీజీ వెంకటేశ్ (కర్నూలు), ఏరాసు ప్రతాపరెడ్డి(శ్రీశైలం), కాటసాని రాంభూపాల్‌రెడ్డి(పాణ్యం), శిల్పామోహన్‌రెడ్డి(నంద్యా ల). ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డీ వెళతారనే ప్రచారం జరుగుతోంది.
అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డి(తాడిపత్రి), మధుసూదన్‌గుప్తా (గుంతకల్). వీరిలో జేసీ పార్టీలోనే కొనసాగుతారని, ఆయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డి, కుమారుడు పవన్ తొలుత వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని ఆసక్తి చూపినప్పటికీ అక్కడ అవకాశం లేదని తేలడంతో దానికి బ్రేక్ పడింది. దాంతో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.