నగదు రహితం.. కష్టం
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అయినప్పటికీ తగినంత నగదు లభించడం లేదు. బ్యాంకులకు నగదు సరఫరా నామమాత్రంగానే ఉండడంతో రోజువారీ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, స్వైపింగ్, ఈ వాలెట్లు తదితర మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించాలని ప్రజలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో ‘నగదు రహిత లావాదేవీలు-సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై సదస్సు జరిగింది. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లీడ్‌బ్యాంక్ మేనేజర్ జయశంకర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ హరిబాబు, టెక్నికల్ అధికారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. నిరక్షరాస్యత, టెక్నాలజీపై మెజార్టీ ప్రజలకు అవగాహన లేకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదని తేల్చిచెప్పారు.