పోరాడి సాధించుకుందాం...
ఈ వార్డుల్లో సామాజిక మరుగుదొడ్ల సమస్యతో పాటు చాలా సమస్యలు మున్సిపల్ కమిషనర్ పరిష్కరించవలసినవే. ఎమ్మెల్యే నిధుల నుంచి నేను మంజూరు చేసిన పెలైట్వాటర్ స్కీంలు పాడైపోతే... ఆ వార్డు వాసులను సొంత డబ్బులతో బాగుచేసుకోమంటే ఎలాగ ? బంగారమ్మకాలనీలో గిరిజనులకు ఇళ్లపట్టాలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చెబుతుండడం విచారకరం. ఈ విషయమై తహశీల్దార్‌తో మాట్లాడతాను. ఇళ్ల స్థల పట్టాలు పొందని గిరిజనులందరికీ న్యాయం జరిగేలా చేస్తాను. 11వ వార్డు చిన్నవీధిలో సామాజిక మరుగుదొడ్లు మూడేళ్లకిందట నిర్మిస్తే కేవలం ఒక నెలమాత్రమే వినియోగంలో ఉన్నాయి, మోటారు పాడైపోవడంతో నిరుపయోగంగా మారాయి. మోటారుకు మరమ్మతులు జరిపేలా చేస్తాను. మురుగుకాలువకు ఆనుకుని రిటర్నింగ్‌వాల్ నిర్మించాల్సివుంది. అన్నింటికీ మించి అన్ని అర్హతలున్న వారికి పింఛన్లు ఉద్దేశపూర్వకంగా తొలగించారు. అర్హులందరికీ పింఛన్లు పునరుద్ధరించేందుకు తొలుత లోకాయుక్తను ఆశ్రయిస్తాం, ఆపై అవసరమైతే బాధితుల తరఫున న్యాయ స్థానాన్ని ఆశ్రయించి న్యాయం జరిగేలా చేస్తాను.
అవి సాలూరు మున్సిపాలిటీ శివారు మురికివాడలైన 11, 14 వార్డులు. ఇక్కడ దళితులు, గిరిజనులు, నిరుపేదలు ఇలా అన్ని వర్గాల వారు సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. తాగునీరందక, సీసీరోడ్లు, సామాజిక మరుగుదొడ్లు లేక, మురుగు కాలువలు పాడై, పింఛన్లు కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని మురుగు నీరంతా 11వ వార్డులో చిన్నవీధిని ఆనుకుని ఉన్న ప్రధాన కాలువ గుండా ప్రవిహ స్తోంది. దాని నుంచి వచ్చే దుర్గంధంతో వార్డు వాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కాలువకు ఆనుకుని ఉన్న గృహాలు నిత్యం కోతకు గురవుతున్నాయి. ఆయా వార్డుల్లో నివసిస్తున్న పేదల కష్టాలు, అవస్థలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. పేదలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలపై పోరాడి గెలుద్దామని వారికి ధైర్యం చెప్పారు.
రాజన్నదొర : నాపేరు పీడిక రాజన్నదొర. సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేను. మీ సమస్యలు తెలుసుకునేందుకు సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీవద్దకు వచ్చా ను.
రాజన్న : చెప్పమ్మా... నీ పేరేంటి?
ముగదమ్మ : నాపేరు జంగం ముగదమ్మ బాబు. భర్త చనిపోయాడు. సెంటు భూమిలేదు.
రాజన్న : ఏంటి నీ సమస్య?
ముగదమ్మ : నాకు ఐదు ఎకరాల భూమి ఉందని వచ్చే పింఛన్‌ను ఆపేశారు బాబు. నాకు భూమైనా ఇప్పించండి, లేపోతే పింఛనైనా ఇప్పించండి బాబు.
రాజన్న: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పింఛన్లు ఇచ్చారు. నేడు వాటిని తొలగించేశారు. లేని భూమిని ఎలాగూ ఇప్పించలేం. న్యాయంగా రావాల్సిన పింఛన్ వచ్చేలా చేసేందుకు తహశీల్దార్, కలెక్టర్‌ను కలిసి మంజూరయ్యేలా కృషిచేస్తాను.
రాజన్న : నీపేరేంటి?
అప్పయ్యమ్మ: నాపేరు అప్పయ్యమ్మ బాబూ.
రాజన్న: పెద్దావిడా చెప్పునీసమస్య ఏంటి ?
అప్పయ్యమ్మ: నాకు గంజిపోసే వారే లేరుబాబు.
రాజన్న: పింఛన్ వస్తోందా?
అప్పయ్యమ్మ: ఆపీశారు బాబు. ఆధార్‌కార్డులో నావయసు 26సంవత్సరాలని ఉందట, అందుకే ఆపీశారట. రేషన్‌కార్డులో 60 ఏళ్లుగా వుందట.
రాజన్న: అదేంటీ నిన్ను చూస్తేనే 70 ఏళ్లుంటాయని తెలుస్తోంది కదా.
రాజన్న: పెద్దాయనా చెప్పు నీ సమస్య ఏంటి ?
డోల లక్ష్మణ : నాపేరు డోల లక్ష్మణ. చిన్నవీధి పక్కగుండానే పెద్ద మురుగుకాలువ వెళ్తోంది. చాలా ఇళ్లు మురుగుకాలవను ఆనుకుని వున్నాయి. వర్షం పడితే ఇళ్లు కోతకు గురౌతున్నాయి.
రాజన్న: ఏంచేస్తే ఇళ్లు పాడవకుండా ఉంటాయి?
లక్ష్మణ : ఇళ్లు కోతకు గురవకుండా గ్రావెల్ వేసి, రిటైనింగ్ వాల్‌ను ఎత్తుగా కట్టాలి.
రాజన్న: ముసలమ్మా, నీపేరేంటమ్మా? నీకొచ్చిన కష్టమేంటి?
సామాలమ్మ; నాపేరు బిరుసు సామాలమ్మ. నా భర్త పోయాడు. పింఛన్ ఆపేశారు బాబూ.
రాజన్న: వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి కదా... అంతేగాక భర్త చనిపోవడంతో వితంతు పింఛన్‌కు అర్హురాలివే. తప్పక మంజూరయ్యేలా
ప్రయత్నిస్తాను.
రాజన్న:అమ్మానీపేరేంటి?సమస్య చెప్పు.
పైడిరాజు :నాపేరు పైడిరాజు.మొన్నటి తుపానుకు ఇంటి గోడ పడిపోయింది.
రాజన్న: ప్రభుత్వం ఆదుకుందా?
పైడిరాజు: పైసాఇవ్వలేదు సార్. కూలిచేసుకు బతేకేవాళ్లం.
రాజన్న: నీపేరేంటమ్మ? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?
పార్వతి: నాపేరు డోల పార్వతి బాబు. ఇళ్లు కట్టుకోమన్నారు. లోన్ ఇస్తామన్నారు. బిల్లు ఇవ్వడంలేదు. అప్పులపాలైపోయాను.
రాజన్న: నీలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. గృహనిర్మాణ రుణాల బిల్లు ల విషయమై శాసనసభలో మాట్లాడాను. మంత్రి నుంచి గానీ, సీఎం నుంచిగానీ సరైన సమాధానం రాలే దు. రానున్న శాసనసభా సమావేశాలలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను.
రాజన్న: అమ్మా నీపేరేంటి? వ్యాపా రం ఎలాగుంది?
గంగమ్మ: నాపేరు గంగమ్మ సార్. కాయగూరలు వ్యాపారంలో అప్పుడప్పుడూ నష్టం వస్తోంది.
రాజన్న: ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చిందా? లేకపోతే సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నావా?
గంగమ్మ: నాకు 45ఏళ్లు వచ్చేశాయని లోన్ ఇవ్వమనేశారు సార్.
రాజన్న: ప్రభుత్వం అలాంటి రూల్స్ పెడుతోంది మరి.
రాజన్న: మరియమ్మా బాగున్నావా?
మరియమ్మ: ఏం బాగు బాబూ. దీపావళికి సరదాగా బాణసంచా తయారుచేస్తున్నపుడు పేలిననాబిడ్డ అనీల్ ప్రాణాలు పోయాయి. మీకు తెలుసుకదా.
రాజన్న: అధికారులు వచ్చి పరామర్శించారా?, ఆదుకున్నారా?
మరియమ్మ: మీరు తప్ప ఏఒక్కళ్లూ రాలేదు సార్. దళితులమై పుట్టడమే మేం చేసిన పాపమా?, పేదలం కావడమే మేం చేసిన నేరమా?
రాజన్న:ఆదుకోవాలని కలెక్టర్‌కు, సీఎంకు, విపత్తులశాఖకు లేఖలు రాశాను.
అనంతరం ఇదే ప్రమాదంలో ఒక బిడ్డను పోగొట్టుకుని, మరో బిడ్డ రెండు చేతులు తీసేయాల్సి వచ్చిన బిరుసు కళావతి ఇంటికి వెళ్లారు.
రాజన్న: అమ్మా కళావతి బాబుకు ఇప్పుడు ఎలావుంది? కేజీహెచ్‌లో చికిత్స చేస్తున్నారుకదా? ఎందుకు తీసుకువచ్చేశారు?
కళావతి: అక్కడ డాక్టర్లు స్ట్రైక్ చేస్త్తున్నారట బాబూ, పంపేశారు.
రాజన్న: బాబు(కామేశ్వరరావు) మాట్లాడుతున్నాడా?
కళావతి: మాట్లాడలేక పోతున్నాడు.
రాజన్న: సరే మరోమారు సీఎం దృష్టికి తీసుకువెళ్లి వాకతిప్ప ఘటనలో బాధిత కుటుంబాల మాదిరిగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తాను.
రామమందిరం వద్దకు వెళ్లగానే పలువురు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆయన్ను చుట్టుముట్టారు.
రాజన్న; ఏమ్మా!, మీ అందరి పింఛన్లు ఆపేశారా?
పింఛన్ పోగొట్టుకున్న వారంతా: అవునుబాబు.
రాజన్న : అర్హులందరికీ గతంలో లాగ పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నాను. నావంతు ప్రయత్నిస్తాను. మీరు కౌన్సిలర్ అప్పారావును కలసి దరఖాస్తులు ఇవ్వండి.
రోడ్డుపై రిక్షాలో చతికిలబడిన వృద్ధ వికలాంగురాలును పలకరిస్తూ...
రాజన్న: అమ్మా నీపేరేంటి?
కృష్ణమ్మ: నాపేరు గొంప కృష్ణమ్మ బాబూ. పింఛన్ ఆపేశారు.
రాజన్న: నీకు పింఛన్ ఎప్పటినుంచి వస్తోంది?
కృష్ణమ్మ: మీరే మంజూరు చేశారు బాబూ... నడవలేను,( అంతలో ఆమె భర్త ఆమె వికలాంగ ధ్రువీకరణ పత్రాలను చూపారు).60శాతం వికలాంగత్వం వున్నా, వయసు 70ఏళ్లు పైబడినా పింఛన్ ఆపేయడం దారుణమైన విషయమన్నారు.
రాజన్న: అమ్మా నీపేరేంటి?
రోజమ్మ: రివకల రోజమ్మ బాబూ
రాజన్న: నా భార్యపేరు, నా తల్లి పేరుకూడా రోజమ్మే.(అక్కడున్నవారంతా మనసారా నవ్వుకున్నారు)
రాజన్న: చెప్పు ఎలావుంది ఇడ్లీల వ్యా పారం?
రోజమ్మ: రోజుకు 20రూపాయలు లాభం వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు లోన్ ఇవ్వమంటే వయసై పోయిందంటున్నారు.
రాజన్న: అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడుతూ.., ఏమ్మా, పిల్లలకు ఆహారంగా ఏం పెడతున్నారు ?
అంగన్వాడీ కార్యకర్తలు : 11గంటలకు గుడ్లు, 12గంటలకు భోజనం, 3గంటలకు కుర్కురే, శనగలు ఇస్తున్నాం.
రాజన్న: ఏమైనా సమస్యలున్నాయా?
అంగన్వాడీ కార్యకర్తలు : పిల్లలకు రోజూ పప్పు అన్నం పెడుతున్నారని వారి తల్లిదండ్రులు అడుగుతున్నార్ సార్, మాకు అధికారులు అవే ఇస్తున్నారు మరి. అలాగే అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. భవనం మంజూరయ్యేలా చేయండి సార్. పిల్లలు ప్లేట్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. సెంటర్‌కు ప్లేట్లు మంజూరు చేస్తే బాగుంటుంది సార్.
రాజన్న: భవనం మంజూరయ్యేలా తప్పకుండా చేద్దాం. ఈవిషయమై తహశీల్దార్, కలెక్టర్‌తో మాట్లాడతాను.
అక్కడినుంచి సామాజిక మరుగుదొడ్ల దగ్గరకు మహిళలతో వెళ్లారు.
రాజన్న: ఏంటి మీసమస్య?
మహిళలు: మూడేళ్ల కిందట సామాజిక మరుగుదొడ్లను కట్టారు. ఒక్క నెలే ఉపయోగపడింది. మోటారు పాడైందని వదిలేశారు. బాగుచేయండని మున్సిపాలిటీవారిని అడిగితే మీరే ఇంటికి 100రూపాయల చొప్పు న వసూలు చేసుకుని బాగుచేసుకొమ్మంటున్నారు. గెడ్డఒడ్డున కాలకృత్యాలను తీర్చుకోడానికి ఆడాళ్లం వెళ్లడం కష్టంగాఉంటోంది.
రాజన్న: సామాజిక మరుగుదొడ్లను నిర్వహించడం ప్రభుత్వం బాధ్యత. నిరుపేదలైన దళితులను... మీరే బాగుచేసుకోండని అధికారులు చెప్పడం సరైందికాదు.
అక్కడి నుంచి పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు..
రాజన్న: ఏమ్మా నీకేమైంది?, నీపేరేంటి, నీఊరేంటి?
రాధ: నాపేరు కొర్ర రాధ. మా ఊరు ములగవలస, పాము కరిచింది. అందుకే ఇక్కడకు వచ్చాను.
రాజన్న: నొప్పి తగ్గిందా?
రాధ: బాధ తగ్గలేదు. పక్కనేవున్న డాక్టర్ రామ్మూర్తిని పిలిచి సరిగా చూసుకోండని ఆదేశించారు.
రాజన్న: నీకేమయింది? నీపేరేంటి?
మల్లేశ్వరి: నాపేరు మల్లేశ్వరి, మా ఊరు నెలిపర్తి. అక్కడే ఉన్న డాక్టర్ రామమూర్తి కలుగుజేసుకుంటూ నిమోనియాతో బాధపడుతోంది సార్. ఊపిరితిత్తుల్లో చీము చేరిందని అనుమానం. వైద్యం చేస్తున్నామన్నారు.
రాజన్న: డాక్టర్.. చిన్నచిన్న విషయాలకు రిఫర్ చేసేయకండి.
డాక్టర్ రామ్మూర్తి: పంపడం లేదుసార్.
రాజన్న: ఎస్పీహెచ్ఓ గారూ.... ఏమైనా సమస్యలున్నాయా..?
ఎస్పీహెచ్ఓ: ఆస్పత్రిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత వుంది. బెడ్స్ సప్లైలేదు. ప్రహరీ కూలిపోవడంతో ఇబ్బందిగావుంది.
రాజన్న: ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. రోగులకు ప్రయోజనం కలిగేలా., ఆస్పత్రి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాను.
అక్కడి నుంచి నేరుగా బంగారమ్మకాలనీలోని గొడగలవీధి చేరుకున్నారు...
రాజన్న: ఏమ్మా నీపేరేంటి?, ఏమైనా సమస్యలున్నాయా?
ఈశ్వరమ్మ: నాపేరు ఈశ్వరమ్మ. కుళాయినీరు చిన్నధార వస్తోంది. చాలడంలేదు. మీరు కట్టించిన పెలైట్ వాటర్ స్కీం పాడైంది. బోరింగు పాడైంది.
రాజన్న: మున్సిపాలిటీవారు కావాలనే లేని సమస్యలు సృష్టిస్తున్నట్టుగా ఉం ది. తాగునీటి సమస్య తలెత్తకుండా పెలైట్ వాటర్ స్కీంలు మంజూరు చేస్తే మరమ్మతులు జరపకుండా వాటిని వదిలేస్తున్నారు. ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు ఆపేశారు. ఆ నిధులు వస్తే కేటాయిస్తాను. ఈవిషయమై మున్సిపల్ కమిషనర్, కలెక్టర్‌తో మాట్లాడతాను.
కాలనీలోని ఎరుకల వీధికి వెళ్లారు...
రాజన్న: నీపేరేంటమ్మ?
సామాలమ్మ: నాపేరు దాసరి సామాలమ్మ. మాలో చాలామందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేశారని మళ్లీ పట్టాలు ఇవ్వడం లేదు సార్. మాకు ఇళ్ల పట్టాలు ఎప్పడిచ్చారో మాకే తెలియడం లేదు. ఆఫీసర్లేమో ఇచ్చీసామనిచెప్పి, ఇవ్వడంలేదు. అందుకే పాకలలో మగ్గుతున్నాం. మీరే న్యాయం చేయాలి.
రాజన్న: ఇళ్ల స్థల పట్టాలవిషయంలో తహశీల్దార్, కలెక్టర్‌తో మాట్లాడతాను. ప్రయోజనం కలిగేలా కృషిచేస్తాను. పక్కనే ఉన్న కాలనీ నాయకుడు దాసరి భాస్కరరా వును కాలనీ ప్రతినిధిగా సమస్యలు తెలపాలని కోరారు.
భాస్కరరావు: కాలనీలో ఇళ్లస్థల పట్టాల సమస్యతోపాటు మరుగుదొడ్ల సమస్య, తాగునీటి సమస్య ఉన్నాయి సార్. కాలువల్లో పూడికలను సక్రమంగా తీయడం లేదు. మీరు మంజూరు చేసిన నాలుగు పెలైట్ వాటర్ స్కీంలలో రెండు పాడయ్యాయి. వాటిని మున్సిపాలిటీవారు బాగుచేయడంలేదు.
రాజన్న: సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాడదాం. ధైర్యంగా ఉండండి. వస్తాను...!!మళ్లీ కలుద్దాం...