ఆకాశంలో ఉండగా విమానం డోరు తీయబోయి..
సిడ్నీ :
విమానం ఆకాశంలో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎక్సిట్ డోర్( అత్యవసర ద్వారం)ని తెరవడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ప్రముఖ ఎయిర్ లైన్సు సంస్థ ఆస్ట్రేలియన్ క్వాంటాస్‌కు చెందిన ఎయిర్ బస్ ఏ380 విమానంలో చోటు చేసుకుంది.
వివరాలు.. ఎయిర్ బస్ ఏ380 లాస్ ఎంజెల్స్ నుంచి సిడ్నీ బయలుదేరింది. మొత్తం 15 గంటల ప్రయాణంలో అప్పటికే 13 గంటలు ముగిసింది. సరిగ్గా అదే సమయానికి అందులో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన మనుల్ గోంజాలెజ్ తన సీటును నుంచి లేచాడు. నిదానంగా అక్కడి నుంచి ఎమర్జెన్సీ డోర్ దగ్గరకు వెళ్లాడు. అంతే ఒక్కసారిగా డోర్‌ను తెరవడానికి విశ్వప్రయత్నాలు చేయసాగాడు. ఆ సమయానికి విమానం భూమి నుంచి 39వేల అడుగుల(12 కిలో మీటర్లు) ఎత్తులో ఉంది.
గోంజాలెజ్ అకస్మాత్తుగా చేసిన ఆ పనికి విమానంలో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా గమనించిన విమాన సిబ్బంది అక్కడికి వెంటనే చేరుకొని అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. గోంజాలెజ్‌ను తిరిగి అతని సీట్లో కూర్చోబెట్టి విమానం గమ్యాన్ని చేరుకునే వరకు అతని చుట్టు నిలబడ్డారు. ఎందుకు గోంజాలెజ్ డోర్‌ను ఓపెన్ చేయాలనుకున్నాడో మాత్రం ఆయనకే ఓ స్పష్టత లేదు.
'ఒక వేళ గోంజాలెజ్ డోర్‌ను తెరవాలని ప్రయత్నించినా సఫలీకృతం అయ్యేవాడు కాదు. ఎందుకంటే అధిక ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ డోర్‌ను తెరవడం దాదాపు అసాధ్యం. క్యాబిన్‌పై ఉండే పీడన బలం డోర్‌ను తెరవడానికి అనుమతించదు' అని ఎయిర్ లైన్ పైలెట్, కాక్ పిట్ కాన్ఫిడెన్షియల్(ఎయిర్ ట్రావెల్‌కు సంబంధించి సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం) పుస్తక రచయిత పాట్రిక్ స్మిత్ పేర్కొన్నారు.
అంతేకాకుండా డోర్‌కు ఎలక్ట్రికల్, మెకానికల్ ఉపకరణాలు తెరవడానికి అడ్డుగా ఉంటాయి. వీటిని దాటుకుని డోర్లు తెరవాలంటే హైడ్రాలిక్ జాక్‌లు అవసరముంటాయి. వీటిని ఎయిర్ పోర్టు రక్షణ సిబ్బంది విమానంలోనికి తీసుకురాకుండా అడ్డుకుంటాయి. అతీత శక్తులున్న మనుషులకు తప్ప మామూలు మానవులకు అంత ఎత్తులో విమాన డోర్లను తెరవడం అంత సులువైన పని కాదు. అయితే ఈ విషయాలన్ని తెలియకుండానే గోంజాలెజ్ విమాన డోర్లను తెరవడానికి ప్రయత్నించాడని పాట్రిక్ స్మిత్ తెలిపారు.
సేఫ్‌గా విమానం ల్యాండ్ అయిన తర్వాత గోంజాలెజ్‌ను ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమాన భద్రతకు విఘాతం కల్పించాలని చూశాడనే కారణంగా అతని పై కేసును నమోదు చేశారు. సెంట్రల్ లోకల్ కోర్టులో విచారణ జరగగా తదుపరి విచారణ మార్చి 15కు వాయిదా పడింది. ఈ కేసులో గోంజాలెజ్ దోషిగా తేలితే దాదాపు 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.