వంచన పంచన
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. వారికి పునరావాసం పేరిట నిర్మిస్తున్న ఇళ్లకు అతి తక్కువ మొత్తం కేటాయిస్తోంది. నిర్వాసితుల కోసం నిర్మించే ఒక్కొక్క ఇంటికి.. గిరిజనులైతే రూ.4.55 లక్షలు, గిరిజనేతరులైతే రూ.3.55 లక్షల చొప్పున వెచ్చించాలని జీఓ జారీ చేసినప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద ఒక్కొక్క ఇంటికి రూ.2 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నారు. ఇదేం దారుణమని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు ఏ మూలకు సరిపోతాయని లబ్ధిదా రులు నిలదీస్తున్నారు.
మోడల్ కాలనీల్లో.. స్నానపు గదుల తరహాలో..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలు ముంపుబారిన పడనున్నాయి. పోలవరం మండలంలో 29 ముంపు గ్రామాలు ఉండగా, 3 గ్రామాల్లో జనావాసాలు లేవు. మిగిలిన 26 గ్రామాల్లోని 7 గ్రామాల ప్రజలకు ఇప్పటికే పునరావాసం కల్పించారు. మిగిలిన 19 గ్రామాలను ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం రెండో విడత పునరావాస కార్యక్రమం అమలు చేస్తోంది. ఈ గ్రామాల్లోని 2,480 కుటుంబాలతోపాటు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 29,545 కుటుంబాలకు పునరావాస కేంద్రాల్లో ఇళ్లు నిర్మించాల్సి ఉంది. మొదటివిడత పునరావాస గ్రామాల నిర్వాసితులకు సంబంధించి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.15 లక్షలు కేటాయించింది. కానీ.. ప్రస్తుతం ఖాళీ చేయాల్సిన నిర్వాసితులకు సంబంధించి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేవలం రూ.2 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో నిర్వాసితులు ఘొల్లుమంటున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో 26 మోడల్ కాలనీల నిర్మాణం చేపట్టారు. వాటిలో స్నానపు గదుల తరహాలో సిమెంట్ ఇటుకలతో ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 17 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టి శ్లాబ్లు కూడా వేశారు.
ఇంత దారుణమా
జీఓ ప్రకారం గిరిజన నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.4.55 లక్షలు, గిరిజనేతరుల ఇంటి నిర్మాణానికి రూ.3.55 లక్షలు కేటాయించాల్సి ఉందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి కారం వెంకటేష్, నాయకుడు సున్నం పోశీరావు పేర్కొన్నారు. జీఓను తుంగలో తొక్కి కేవలం రూ.2 లక్షలు మాత్రమే కేటాయించి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఇంత దారుణం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి జీఓ ప్రకారం నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.
రూ.2 లక్షలతో ఇల్లు పూర్తవుతుందా
మాది వాడపల్లి గ్రామం. పోలవరం ముంపు గ్రామం కావటంతో జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెంలో ఇంటిస్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు పైగా వస్తుందని ఆర్డీఓ చెప్పారు. ఇప్పుడు రూ.2 లక్షలు మాత్రమే వస్తుందంటున్నారు. ఆ మొత్తంతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందా. మొదట విడతలో గ్రామాలు ఖాళీ చేసిన వారికి రూ.3.15 లక్షలు ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం.
– నూనె గంగరాజు, నిర్వాసితుడు
ఐఏవై పథకంలో నిర్మిస్తున్నారు
కొత్త భూసేకరణ చట్టం–2013 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరా ఆవాజ్ యోజన (ఐఏవై) కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఉంది. నిర్వాసితులకు ఆ ప్రకారమే ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పథకంలో ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలు మాత్రమే కేటాయిస్తారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది.
– ఎం.ముక్కంటి, తహసీల్దార్, పోలవరం