ఫస్ట్ సినిమాకే లక్ష అడిగా... కానీ చిరంజీవి..: పొన్నంబలం
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోని అందరు సూపర్స్టార్లతో ఫైట్ చేశాడు పొన్నంబలం. విలన్‌గా తన లుక్స్‌తోనే భయపెట్టించే అతడు సినిమాల్లో రాక్షసాన్ని చూపించేవాడు. విలన్‌గా సినిమాల్లో ఇతరుల జీవితాలను మట్టుబెట్టేందుకు ప్రయత్నించేవాడు. కానీ నిజ జీవితంలో మాత్రం అతడి సొంత తమ్ముడే పొన్నంబలం పాలిట విలన్ అయ్యాడు. అతడికి తెలియకుండా స్లో పాయిజన్ ఇచ్చి చంపాలనుకున్నాడు. ఈ విషయం అతడికి తెలిసే సమయానికే తన రెండు కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి అతడికి ఆర్థిక సాయం చేయడంతో వెంటనే చికిత్స చేయించుకుని తిరిగి కోలుకున్నాడు.
లక్ష ఇస్తేనే ఫైట్..
తాజాగా పొన్నంబలం అప్పటి దీనమైన పరిస్థితితో పాటు తన మొదటి సినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 'జిమ్నాస్టిక్స్ నేర్చుకుని అందులో పర్ఫెక్ట్ అయ్యాను. తమిళంలో సినిమాలు చేస్తున్నప్పుడు నాకు తెలుగులో ఘరానా మొగుడు సినిమా ఆఫర్ వచ్చింది. ఇక్కడ అదే నా తొలి చిత్రం. అయితే ఎవరు లక్ష రూపాయలు ఇస్తారో వాళ్లతోనే సోలో ఫైట్ చేస్తానని చెప్పాను. మా ఫైట్ మాస్టర్ వచ్చి ఒక్క ఫైట్‌కే లక్ష అడుగుతావేంటి? అని ఆశ్చర్యపోయాడు. ఘరానా మొగుడు టీమ్ మాత్రం అంత గొప్పగా ఫైట్ చేస్తాడా? చూద్దాం.. అని నన్ను పిలిపించారు. ఏంటి, లక్ష అడుగుతున్నావని అడిగారు.
చిరంజీవి గిఫ్ట్..
సర్, మీరు నాకు డబ్బులు ఇవ్వొద్దు.. ఫైట్ చేశాక బాగా వస్తేనే లక్ష ఇవ్వండి అని చెప్పాను. నాలుగు రోజులు ఫైట్ సీన్ షూట్ జరిగింది. బాగా చేశానని మెచ్చుకుని రూ.1 లక్ష ఇచ్చారు. ఘరానా మొగుడు 175 రోజులు ఆడింది. తర్వాత ఓసారి ఆఫీస్‌కు రమ్మని ఫోన్ వచ్చింది. వెళ్తే డబ్బులిచ్చారు. నెక్స్ట్ సినిమా కోసం ఇచ్చారేమో అనుకున్నాను. తీరా ఆ డబ్బులు లెక్కపెడ్తే రూ.5 లక్షలున్నాయి. పొరపాటున వేరేవాళ్లకు ఇవ్వాల్సింది నాకిచ్చారేమోనని కాల్ చేస్తే చిరంజీవి ఇచ్చారని చెప్పారు. ఘరానా మొగుడు సినిమాకు అంత డబ్బు గిఫ్ట్‌గా ఇచ్చారు' అని చెప్పుకొచ్చాడు.
నాకోసం అరకోటి దాకా ఖర్చు..
తమ్ముడు విషప్రయోగం చేసిన సంఘటన గురించి మాట్లాడుతూ.. 'నా ఎదుగుదల ఓర్వలేక సొంత తమ్ముడే ఆహారంలో, డ్రింక్స్‌లో స్లో పాయిజన్ కలిపాడు. అది తెలియక వాడిని నమ్మి ఉద్యోగం కూడా ఇచ్చాను. కానీ నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్నే చంపాలని చూశాడు. స్లో పాయిజన్ వల్ల రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఆ సమయంలో చిరంజీవి నన్ను కాపాడాడు. ఆ భగవంతుడు చిరంజీవి రూపంలో వచ్చి సాయం చేశాడు. చిరంజీవి కోడలు ఉపాసన కూడా ఫోన్ చేసి మాట్లాడింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం చిరంజీవి దాదాపు రూ.50 లక్షల దాకా ఖర్చుపెట్టాడు' అని తెలిపాడు.
చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో? ఆమె రియాక్షన్ ఇదే!