పీఠాధిపతి నియామకాన్ని 2 నెలల్లో పూర్తిచేయండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా, కందిమల్లయ్య పల్లె గ్రామంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి కన్నుమూసిన నేపథ్యంలో పీఠాధిపతి నియామకాన్ని రెండు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు గురువారం ఏపీ ధార్మిక పరిషత్‌ను ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విని పీఠాధిపతి నియామకం చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ, కుమారుడు ఎన్.గోవిందస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమను పీఠాధిపతులుగా బాధ్యతలు నిర్వర్తించకుండా దేవదాయ శాఖాధికారులు జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దుచేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. మఠం పీఠాధిపతిని తాత్కాలికంగా నియమించే అధికారం ధార్మిక పరిషత్‌కు ఉందని స్పష్టంచేశారు. మఠాధిపతులుగా తమను నియమించాలన్న అభ్యర్థనను సింగిల్ జడ్జి పట్టించుకోలేదంటూ గోవిందస్వామి, మారుతి మహాలక్షుమ్మ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం తీర్పునిచ్చిన ధర్మాసనం.. ఇరుపక్షాల వాదనలు విని రెండునెలల్లో మఠం పీఠాధిపతి నియామకాన్ని పూర్తిచేయాలని ధార్మిక పరిషత్‌ను ఆదేశించింది.