సినిమా రివ్యూ: ఒక లైలా కోసం
నటీనటులు: నాగ చైతన్య, పూజా హెగ్డే, సుమన్, షియాజీ షిండే, చలపతిరావు తదితరులు..
సంగీతం: అనూప్ రూబెన్
నిర్మాత: అక్కినేని నాగార్జున
దర్శకుడు: విజయ్ కుమార్ కొండా
కథ..
కార్తీక్ (నాగచైతన్య) పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో టాప్ ర్యాంకర్. చదువు పూర్తయిన తర్వాత పెద్ద కంపెనీల నుంచి ఉద్యోగాలను వచ్చిన ఆఫర్లను తిరస్కరించి.. ఓ ఏడాదిపాటు హాలీడే ట్రిప్‌కు కార్తీక్ వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే నందన(పూజా హెగ్డే)ను కార్తీక్ ప్రేమిస్తాడు. అయితే చిన్న చిన్న కారణాల వలన కార్తీక్‌ను నందన ద్వేషిస్తుంది. కాని నంద న, కార్తీక్‌ల తల్లి తండ్రులు వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు. తల్లితండ్రులను బాధపెట్టడం ఇష్టంలేని నందూ పెళ్లికి ఒప్పుకున్నప్పటికి.. కార్తీక్‌ను ద్వేషించడం మాత్రం మానదు. చివరికి కార్తీక్ ప్రేమకు నందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? నందన మనసును కార్తీక్ ఎలా గెలుచుకున్నాడు, కార్తీక్‌ను ద్వేషించడానికి కారణాలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరమీద చూడాల్సిందే.
ఆకట్టుకునే అంశాలు:
నాగచైతన్య, పూజా హెగ్డే ఫెర్ఫార్మెన్స్
ఫోటోగ్రఫి
ఆలీ కామెడీ
రీరికార్డింగ్
నిరాశపరిచే అంశాలు:
రోటిన్కథ,
ఆకట్టుకోలేని కథనం
దర్శకత్వం
పాటలు
డైలాగ్స్
నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..
నందన ప్రేమకు కోసం తపన పడే ప్రేమికుడిగా కార్తీక్ పాత్రలో నాగచైతన్య పర్వాలేదనిపించారు. ఫెర్ఫార్మెన్స్ విషయంలో గతంలో కంటే కొంత మెరుగ్గా కనిపించినప్పటికి.. ఇంకా మెచ్యురిటీని సాధించాల్సిన అవసరం ఉంది. ఈ చిత్ర విజయ భారం మొత్తం నాగచైతన్య తన మీద వేసుకున్నారు.
నందన పాత్రలో పూజా హెగ్డే గ్లామర్‌తో ఆకట్టుకుంది. నందన పాత్రలో పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్నప్పటికి.. పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదనే అనిపించింది. మిగితా పాత్రలన్నింటినిలోనూ కొత్తదనం కనిపించకపోగా తెరమీద పరమ రోటిన్‌గానే కనిపిస్తాయి. ఈ చిత్రంలో ఆలీ కామెడీ కొంత ఊరట కలిగించే విధంగా ఉంటుంది.
సాంకేతిక విభాగాల పనితీరు:
ఓ లవ్ స్టోరికి సరిపడే ఫీల్‌ను కలిగించడానికి తన ఫోటోగ్రఫి ద్వారా ఐ ఆండ్రూ శాయశక్తులా ప్రయత్నించాడు. నాగచైతన్య, పూజా హెగ్డేలను గ్లామర్‌గా తెర మీద చూపించడంలో అండ్రూ సఫలయ్యారు. పేలవమైన కథనాన్ని కనిపించకుండా తన ఫోట్రోగ్రఫి ద్వారా అండ్రూ మేనేజ్ చేశాడని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అనూప్ రూబెన్స్ ఆకట్టుకున్నా.. పాటలు మాత్రం ఆలరించలేకపోయాయి. అద్నాన్ సమీ పాడిన ‘ఓ చెలి నువ్వే నా..’ బాగుంది. ఒక లైలా కోసం పాట తెరమీద ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో కంటెంట్ లేని సీన్లు ఎక్కువగానే కనిపించాయి. ఎడిటర్ ప్రవీణ్ పుడి పూర్తి స్థాయిలో తన ప్రతిభకు పని పెట్టాల్సిందనే అభిప్రాయం కలుగుతుంది.
చివరగా..
ఎన్నుకున్న కథలో పస లేకపోవడంతో తొలి భాగ ం నిస్సారంగా సాగుతుంది. మధ్య మధ్యలో ఆలీ కామెడీ మెనేజ్ చేసేందుకు ప్రయత్నించారు. పూజా హెగ్డే ఇంట్రడక్షన్ సీన్ చిత్రీకరణ దర్శకుడి టేస్ట్ కు అద్దం పడుతుంది. కొన్ని ఫీల్ గుడ్ సన్నివేశాలను చిత్రీకరించడంలో దర్శకుడి నైపుణ్యం కనిపించింది. అయితే కథనంలో వేగం లేకపోవడం.. సాధారణ ప్రేక్షకుడు సైతం ఊహించగలిగే క్లైమాక్స్ ఉన్నప్పటికి.. ఓ మంచి ఫీల్‌తో ముగించలేకపోవడం లాంటి అంశాలు ప్రతికూలంగా మారాయి. ‘స్టార్’ ఎపిసోడ్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆతర్వాత అదే ఊపును దర్శకుడు కొనసాగించలేపోయారు. రొటిన్ కథ, రెగ్యులర్ కథనానికి డైలాగ్స్ కూడా బలంగా మారలేకపోయాయి. ‘గుండె జారి గల్లంతయిందే’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయారని చెప్పవచ్చు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు బీ,సీ సెంటర్ల ప్రేక్షకులు ‘ఒక లైలా..’తో కనెక్ట్ అవ్వడంపైనే భారీ విజయం అధారపడి ఉంది.
--రాజబాబు అనుముల