సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతిగా పోటీ: మీరా కుమార్
హైదరాబాద్ : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ సోమవారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతి ఎన్నికలలో నిలబడినట్లు తెలిపారు. తనకు మద్దతు ప్రకటించిన 17 రాజకీయ పార్టీలకు మీరా కుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఎంఐఎంను కూడా మద్దతు ఇవ్వాలని కోరతామని ఆమె పేర్కొన్నారు. టీఆర్ఎస్ మద్దతు కోసం ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో మాట్లాడేందుకు ప్రయత్నించామని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. తాను స్పీకర్గా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే యూపీఏ తెలంగాణ ఇచ్చిందని మీరా కుమార్ పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీరా కుమార్కు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.