'0' నొక్కితే గ్యాస్ రాయితీ వదులుకున్నట్లే
ఇలా సరి చేసుకోవచ్చు
గ్యాస్ బుకింగ్ చేసే సమయంలో పొరబాటున 0 నొక్కి రాయితీ
కోల్పోతే సంబంధిత డీలర్‌ను సంప్రదించాలి.
డీలర్ వద్దకు వెళ్లి ఫారం పూర్తి చేసి సమర్పిస్తే సరిపోతుంది.
రాయితీ వదులుకోవాలనుకున్నా ఫారం-5 ఇవ్వాలి.
ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నకలు పత్రాలు సమర్పించాలి.
సాక్షి నెట్వర్క్ : సెల్‌ఫోన్ ద్వారా ఐవీఆర్ఎస్ పద్ధతిలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా. కాస్త ఆలోచించండి. ఏమాత్రం అజాగ్రత్తగా నంబరు నొక్కినా తిప్పలు తప్పవు. 0 నొక్కితే గివ్ ఇట్ అప్ కింద మీ రాయితీ అర్హత వదులుకున్నట్టే. ఆ తర్వాత తిరిగి రాయితీ అర్హత పొందాలంటే నానా అవస్థలు పడాలి. దరఖాస్తు ఫారం పూర్తి చేసి డీలర్‌కు ఇవ్వాలి. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాలి. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కొద్దిపాటి అప్రమత్తంగా ఉంటే చాలు.
గ్యాస్ బుక్ చేయాలంటే ..
ప్రభుత్వం నేరుగా సెల్‌ఫోన్ ద్వారా ఐవీఆర్ఎస్ పద్ధతిలో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇండేన్, భారత్, హెచ్‌పీ సంస్థల బుకింగ్ నంబరుకు ఫోన్ చేయగా.. డీలర్ ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్‌ను కంప్యూటర్ అడుగుతుంది. కొన్నిసార్లు వినియోగదారుడి గ్యాస్ నంబరు కోరుతుంది. ఈమధ్య బుకింగ్ నంబరు డయల్ చేయగానే, వినియోగదారుని నంబరు చెబుతుంది.
ఈ నంబరు చెప్పడం పూర్తికాగానే, సిలిండర్ బుక్ చేయాలంటే 1 నొక్కండని, గ్యాస్ రాయితీ వదులు కోవాలని భావిస్తే 0 నొక్కండని, ఆధార్ నమోదు చేయకపోతే 2 నొక్కండని చెబుతుంది. ఈ విషయం తెలియక రెండోసారి చెప్పే 0 అనే అంకెను నొక్కుతున్నారు. దీంతో గ్యాస్ సబ్సిడీ స్వచ్ఛందంగా వదులుకున్నట్టు అవుతోంది.
గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యం
గ్యాస్ సబ్సిడీకి సంబంధించి పొరబాటుగా 0 నొక్కిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. వారిని పూర్తి ధరతో గ్యాస్ తీసుకోవాలని డీలర్ల ఒత్తిడి చేసేవారు. తమ చేతిలో ఏమీ లేదని తప్పించుకునేవారు. ఏప్రిల్ నుంచి రాయితీ కింద మార్పు చేసుకోవచ్చని సూచించేవారు. కాగా 0 నొక్కి పొరబాటు చేసే వారి సంఖ్య పెరిగిపోతుండడంతో.. ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులు చేసే తప్పును సరిదిద్దే అవకాశం ఇటీవల డీలర్లకు అప్పగించారు.
ఎవరిని సంప్రదించాలి?
డీలర్లకు ఈ సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించారు. డీలర్ల వద్ద కూడా ఇది పరిష్కారం కాకపోతే, సంబంధిత చమురు కంపెనీల అధికారులను సంప్రదించాలి. గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇండేన్ : 98488 24365, భారత్ : 94401 56789, హెచ్‌పీ : 96660 23456.